తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

'13న కార్తిక మాస "క్షీరాబ్ది ద్వాదశి" - తులసికోట వద్ద ఇలా పూజిస్తే అన్నీ శుభాలే' - KSHEERABDI DWADASI 2024

- బుధవారం నాడు చిలుకు ద్వాదశి - ఈ పూజతో శివానుగ్రహం మీపైనే

Ksheerabdi Dwadasi 2024
Ksheerabdi Dwadasi 2024 in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 3:25 PM IST

Ksheerabdi Dwadasi 2024 in Telugu : ఆ పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తికం. ఈ నెలంతా వివిధ పండగలు, ఉత్సవాలతో నిండిపోతుంది. ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తిక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని 'క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి' అని పిలుస్తారు. అమృత‌ం కోసం దేవతలు, దానవులు పాలసముద్రాన్ని ఈ రోజున చిలికారట. అందుకే.. దీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈ నెల 13వ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ రోజున మహిళలు తులసికోట దగ్గర ఒక విధివిధానం పాటించాలట. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీకటాక్షం, తులసి మాత అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్'​ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత..

ఉత్థాన ఏకాదశి అంటే.. కార్తిక శుక్ల శుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు.. నిద్రలో నుంచి మేల్కొంటాడు. మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. శ్రీమహా విష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసిమాతను వివాహం చేసుకుంటాడు. అందుకే.. విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కల్యాణం జరుగుతుంది. పెళ్లైన దంపతులు దేవ దేవతల కల్యాణ వేడుకలను తిలకించి అక్షతలు వేసుకుంటే చాలా మంచిది.

పూజా విధానం..

  • క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి.
  • తులసికోట దగ్గర వీలైతే గోమయం (ఆవుపేడ)తో అలకాలి. లేకపోతే నీటితో శుద్ధి చేయాలి.
  • తులసికోట దగ్గర బియ్యం పిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్​ గుర్తులున్నటువంటి ముగ్గు వేయాలి.
  • ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది.
  • తర్వాత తులసికోట దగ్గర మట్టిప్రమిదలో ఆవునెయ్యి పోయాలి. 9 వత్తులు వేసి దీపం పెట్టాలి.
  • గులాబీ పూలు, తెల్లటి పూలు తులసికోట దగ్గర ఉంచాలి. అలాగే ద్రాక్షపండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి.
  • 'ఓం బృందావనీయాయ నమః' అనే మంత్రం చదువుతూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
  • ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు.
  • క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలి. ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
  • అలాగే ఈ రోజు తులసికోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలి.
  • తులసికోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి.
  • ఈ ప్రత్యేకమైన విధివిధానాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయని మాచిరాజు కిరణ్​ కుమార్​ సూచిస్తున్నారు.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కార్తిక సోమవారం వీటిల్లో ఏ ఒక్క పని చేసినా - శివుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారట!

సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే అక్షయ నవమి- ఉసిరిక పూజ ఇలా చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయ్​!

ABOUT THE AUTHOR

...view details