తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కోటి సోమ‌వార వ్రతం విశిష్టత ఏంటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేసుకోవాలి?

శతకోటి జన్మల పాపాలను పోగొట్టే కోటి సోమవార వ్రతం

Koti Somavara Vratam
Koti Somavara Vratam (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Koti Somavara Vratam Vidhi In Telugu :కార్తిక మాసంలో శివారాధన విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక కార్తిక మాసంలో మాత్రమే వచ్చే కోటి సోమవారం గురించి తెలుసా! అసలు కోటి సోమవారమంటే ఏమిటి? కోటి సోమవారం ఎలా ఏర్పడుతుంది? కోటి సోమవారం వ్రతాన్ని ఎలా చేయాలి తదితర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

కోటి సోమ‌వారం విశిష్టత
కార్తిక మాసంలోనే ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు చేసే స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం.

కోటి సోమవారమంటే?
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజును కోటి సోమవారం అంటారు. కార్తిక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం రోజే రావాలన్న నియమేమి లేదు. అరుదుగా కోటి సోమవారం, కార్తిక సోమవారం కలిసి వస్తే ఆ రోజు మరింత విశేషమని పండితులు అంటారు.

కోటి సోమవారం ఎప్పుడు?
ఈ ఏడాది నవంబర్ 8 వ తేదీ, శుక్రవారం కార్తిక శుద్ధ సప్తమి తిధి పూర్తిగా ఉంది. అలాగే శ్రవణా నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 11:47 నిమిషాల వరకు ఉంది. కోటి సోమవారమంటే సప్తమి తిథితో పాటు శ్రవణా నక్షత్రం కూడా కలిసి ఉండాలి కాబట్టి నవంబర్ 8వ తేది శుక్రవారం రోజునే కోటి సోమవారం వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

కోటి సోమవారం పూజావిధానం
నదీస్నానం
శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచియై నదీస్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని అంటారు. అందుకే ఈ మాసంలో నది స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది.

ఉపవాసం
సాధారణంగా కార్తిక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తిక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తిక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహరం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.

శివకేశవుల పూజ
ఈ రోజు శివాలయంకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుని అభిషేకించాలి. నువ్వులనూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. అనంతరం బిల్వ దళాలతో, తుమ్మి పూలతో శివుని అర్చించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించాలి. సాయంకాలం యధావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని విష్ణువు ఆలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేసి, తులసీమాలను నారాయణునికి సమర్పించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

సాలగ్రామ పూజ
భారతదేశంలో నేపాల్ పరిసర ప్రాంతాలలో దొరికే సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. కోటి సోమవారం రోజు సాలగ్రామాలను గంధ పుష్పాక్షతలతో పూజించి సద్భ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనం.

వనభోజనం
సాధారణంగా కార్తిక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వనభోజనానికి మాములు కన్నా కోటి రెట్లు అధిక ఫలం ఉంటుంది. ఈ రోజు ఉసిరిక చెట్లు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధు మిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయాలి.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
కార్తిక మాసంలో కోటి సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవారం వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. అష్టైశ్వర్యాలను పొందుదాం. ఓం నమః శివాయ! జై శ్రీమన్నారాయణ!

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details