తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

దీపావళి తర్వాత రోజు ఈ వ్రతం చేసుకుంటే చాలు- దంపతులు కలకాలం సుఖంగా!

అన్యోన్య దాంపత్యానికి ప్రతీక కేదారగౌరి వ్రతం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Kedareswara Vratham Pooja Vidhanam In Telugu : భార్యాభర్తలు అనగానే ముందుగా గుర్తొచ్చేది శివ పార్వతులే! ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ లోకానికే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులు. ఎవరైనా ఆశీర్వదించేటప్పుడు ఆదిదంపతుల లాగా కలకాలం ఉండండి అంటారు. అంటే శివపార్వతులది అంతటి అన్యోన్య దాంపత్యం అన్నమాట! తన శరీరంలోనే అర్థభాగాన్ని పార్వతికి ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా పేరొందిన ఆ ఉమా మహేశ్వరుల అన్యోన్యతకు అద్దం పట్టే కేదార గౌరీ పూజ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కేదార గౌరీ వ్రతం అంటే?
కేదార గౌరీ వ్రతం భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. దీపావళి అమావాస్య రోజున జరుపుకునే ఈ కేదార గౌరీ వ్రతం భార్యాభర్తలిద్దరూ కలిపి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకోవచ్చు. భార్యకు వీలుకాకపోతే మాత్రం భర్త ఒక్కడే చేయకూడదు. వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చు.

కేదార గౌరీ వ్రతం ఎప్పుడు?
ఆశ్వయుజ అమావాస్య రోజు కేదార గౌరి వ్రతం చేసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:52 నిమిషాల నుంచి అమావాస్య మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:57 గంటల వరకు వరకు ఉంది. సాధారణంగా పర్వదినాలు, వ్రతాలు సూర్యోదయం తిధితోనే జరుపుకోవాలి కాబట్టి నవంబర్ 1వ తేదీనే కేదార గౌరీ వ్రతం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

కేదార గౌరీ వ్రతం పూజకు శుభ సమయం
ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు తిరిగి 9 గంటల నుంచి 10:30 గంటల వరకు పూజకు శుభ సమయం.

కేదార గౌరీ వ్రతం పూజా విధానం
కేదారగౌరి వ్రతం చేసుకునే వారు సూర్యోదయంతోనే నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శివపార్వతుల చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ చెంబుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో గంగాజలం నింపి, కొబ్బరికాయ, మామిడాకులు ఉంచి ఎర్రని వస్త్రంతో అలంకరించి కలశాన్ని తయారు చేసుకోవాలి. కలశంలోకి సకల పుణ్య తీర్ధాలను ఆవాహన చేయాలి. కలశంలోకి, ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహన చేయాలి. 21 ఉపచారాలతో పూజ చేయాలి. తుమ్మి పూలు, మారేడు దళాలు, ఎర్ర మందారాలు, చేమంతులతో కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ భక్తిశ్రద్ధలతో చేయాలి.

తోరపూజ
ముందుగా 21 పేటల పట్టు దారంతో కాని, నూలు దారంతో కాని 21 గ్రంధులతో తోరాన్ని తయారు చేసుకోవాలి. 21 నామాలు కల తోర గ్రంథి పూజ చేసి తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి.

నైవేద్యం
గోధుమ పిండితో తయారు చేసిన 21 నేతి అరిసెలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం, అన్ని రకాల కూరలు, పళ్ళు నివేదన చేయాలి. అనంతరం కేదార గౌరి వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి.

అందుకే అర్ధనారీశ్వర తత్వం
కేదారగౌరి వ్రతం గురించి గౌతమ మహర్షి చెప్పగా పార్వతీ దేవి స్వయంగా ఆచరించి పరమశివునిలో అర్థభాగాన్ని పొందినట్లుగా మనకు లింగ పురాణం ద్వారా తెలుస్తోంది. కేదారం అంటే మాగాణం. వరి పండే పొలం. దానికి అధిపతి కేదారేశ్వరుడు. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తి హీనుడయిన గాథను వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రత కథ స్త్రీ పురుషుల సమానత్వాన్ని తెలియచేస్తుంది. గౌరీదేవి లేనిదే శివుడికి పూజలేదు. గౌరితో కూడిన సాంబశివుణ్ణి పూజించే ఈ అరుదైన వ్రతాన్ని ఆచరిస్తే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. రానున్న ఆశ్వయుజ అమావాస్య రోజు కేదార గౌరి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. ఆ ఆదిదంపతుల అనుగ్రహంతో అన్యోన్య దాంపత్యంతో కలకాలం సుఖంగా ఉందాం. నమః పార్వతీపతయే! హరహర మహాదేవ శంభో శంకర!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details