Karthika Puranam Day 1 In Telugu : పరమ పవితమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజూ విన్నా చదివినా అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం. ప్రతిరోజూ ఒక్కో కథ ఉండే కార్తీక పురాణంలో ప్రతి కథ నుంచి మనం ఒక నీతిని గ్రహిస్తాం. మనిషి ఎలా జీవించాలి? ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పయనించాలి? తెలియజేసే కథల సమాహారమే కార్తీక పురాణం. ఈ ముప్పై రోజుల పాటు ప్రతిరోజూ కార్తీక పురాణం చదువుకుందాం తరిద్దాం. ఈ కథనంలో కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం.
సూత ఉవాచ
పూర్వం నైమిశారణ్యమునకు సూతమహర్షి రాగా శౌనకాది మునులు ఆయనను సత్కరించి, సంతుష్టుని చేసి కైవల్యదాయకం అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి వారిని ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన సూతమహర్షి "శౌనకాదులారా! నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం. కావున ప్రతిరోజూ నిత్య పారాయణంగా ఈ నెల అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను వినండి" అంటూ చెప్పసాగాడు.
కార్తీకమహత్యాన్ని వివరించమని వశిష్ఠుని కోరిన జనకుడు
పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యం కొరకు వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్ళాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి ''హే బ్రహ్మర్షీ! మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కూడా కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని, చెప్తూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతం ధర్మం ఎటువంటింది'' అని అడుగగా వశిష్టుడు చిరునవ్వు నవ్వి ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు విన్నంతమాత్రంచేత అన్ని పాపాలనూ అణచివేసేదీ అయిన కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలిగింది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను విను, అంటూ చెప్పసాగాడు.
కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణం నుంచి గాని, శుద్ధ పాడ్యమి నుంచి గానీ ప్రారంభించాలి. ముందుగా - ''సర్వపాప హారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే'' ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రీ'' అని నమస్కారపూర్వకంగా సంకల్పం చేసి కార్తీక స్నానం ఆచరించాలి.
మొదటిరోజుకథ
నదీస్నాన మహత్యం
కార్తీకమాసంలో సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే, గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశాయాల్లో కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి.