Karthika Puranam Chapter 19 :పరమ పావనమైన కార్తిక మాసంలో కార్తిక పురాణం పంతొమ్మిదవ అధ్యాయంలో శ్రీమన్నారాయణుడు నైమిశారణ్యంలో మహర్షులను ఏ విధంగా అనుగ్రహించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీహరిని స్తుతించిన జ్ఞానసిద్ధుడు -వశిష్ఠుడి జనకునితో నైమిశారణ్యమునకు శ్రీహరి వెళ్లడం దగ్గర ఆపిన కథను తిరిగి ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పసాగాడు. నైమిశారణ్యమున ఉన్న మహామునులందరు శ్రీహరిని అనేక రకములుగా స్తోత్రం చేసిన తరువాత ఆ మునులలో 'జ్ఞానసిద్ధుడను' ఒక మహాయోగి "ఓ దీనబాంధవా! మాధవా! నీకివే మా నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవైన నీకు స్వాగతం. నీ దర్శన భాగ్యము వలన మేమందరం తరించాము. మా ఆశ్రమములు నీ పాద స్పర్శతో పవిత్రములైనవి. ఓ శ్రీహరి! మేము ఈ సంసార బంధముల నుండి బయట పడలేక కొట్టుకుంటున్నాము. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రములు చదివినా, నీ దివ్యదర్శనం దొరకదు. నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలుగుతుంది. ఓ ఉపేంద్రా! హృషీకేశా! మమ్మల్ని కాపాడు". అని మైమరచి స్తోత్రం చేసాడు.
జ్ఞానసిద్ధుని అనుగ్రహించిన శ్రీహరి -అంతట ఆ శ్రీహరి చిరునవ్వు నవ్వి, "ఓ జ్ఞానసిద్ధా! నీ స్తోత్రమునకు నేనెంతో సంతసించాను. నీకు ఇష్టమొచ్చిన వరము కోరుకొమ్మని" చెప్పెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు "ఓ నారాయణా! నేను ఈ సంసార సాగరం నుంచి విముక్తుడిని కాలేకపోతున్నాను. కావున ఎల్లప్పుడూ నా ధ్యానము నీ పాదపద్మములకు ఉండునట్లుగా నన్ను అనుగ్రహింపుము" అని వేడుకొనగా, అప్పుడు శ్రీమన్నారాయణుడు ఎంతో కరుణతో "ఓ జ్ఞానసిద్ధుడా! నీ కోరిక ప్రకారమే నీకు వరము ఇస్తున్నాను. అంతేకాక నీపైన దయతో నీకు మరొక వరమును కూడా ఇస్తున్నాను.
చాతుర్మాసం మహత్యం -అదేమిటంటే ఈ లోకమున మానవులు దురాచారులై అనేక పాప కర్మములు చేస్తున్నారు. అటువంటి వారి పాపములు పోవడానికి నేను ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సకలజనులు ఆచరించవచ్చును. శ్రద్దగా వినుము". అని చెప్పసాగెను. "నేను ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మీదేవితో కలిసి పాలసముద్రం పై శేష పాన్పుపై పవళిస్తాను. తిరిగి కార్తిక శుద్ధ ద్వాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొంటాను. కావున ఈ నాలుగు నెలలకు చాతుర్మాసమని పేరు. ఈ చాతుర్మాసం లో ఆచరించు చాతుర్మాస వ్రతము నాకెంతో ప్రీతికరము. ఈ వ్రతము ఎవరు భక్తిశ్రద్దలతో ఆచరిస్తారో వారి సకల పాపములు పోయి, మరణానంతరము నా సన్నిధికి చేరుకుంటారు. ఈ వ్రతమునకు నియమాలుగా మొదటి మాసంలో కూరలు, రెండవ మాసం లో పెరుగు, మూడవ మాసంలో పాలు, నాలుగో మాసంలో పప్పుదినుసులు భుజించరాదు. నా భక్తుల యొక్క నిగ్రహ, నిష్ఠను, నాయందు వారికి గల భక్తిని పరీక్షించడానికి నేను యోగ నిద్రావస్థలో ఉండి వారికి ఇట్టి నియమాలను విధించాను. ఇలా భక్తిశ్రద్దలతో ఈ వ్రతమును ఆచరించిన వారు జరావ్యాధుల భయము నుండి విముక్తులవుతారు". అని చెప్పి శ్రీమన్నారాయణుడు శ్రీమహాలక్ష్మితో కలిసి పాలసముద్రమునకేగి శేషపాన్పుపై పవళించాడు.వశిష్ఠుడు జనకమహారాజుతో "ఓ రాజా! ఈ విధంగా శ్రీహరి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతమహాత్యమును గురించి ఉపదేశించెను. ఈ వృత్తాంతము అంగీరసుడు ధనలోభునకు చెప్పాడు. నేను నీకు వివరించాను. కావున ఈ వ్రతమును వయో లింగ భేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చును. అప్పటినుండి శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునులందరూ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు చేరారు". అని చెబుతూ వశిష్టుల వారు పంతొమ్మిదవ రోజు కథను ముగించాడు.