తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వశిష్ఠుడు జనకునితో వివరించిన పురాణ శ్రవణ మహత్యం- ఈ కథ వింటే వైకుంఠ ప్రాప్తి! - KARTHIKA PURANAM 11TH DAY IN TELUGU

సకల పాపహరణం- కార్తిక పురాణ శ్రవణం- 11వ అథ్యాయం మీకోసం

Karthika Puranam 11th Day In Telugu
Karthika Puranam 11th Day In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 4:38 AM IST

Karthika Puranam 11th Day In Telugu :వశిష్ఠుడు జనకునితో పదకొండవ రోజు కథను ఈ విధముగా చెప్పనారంభించెను. "ఓ జనక మహారాజా! కార్తిక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో, వారికి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ, దర్భలతోను పూజించినవారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. రంగురంగుల వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు. కార్తిక స్నానం చేసి విష్ణు సన్నిధిన దీపమును ఉంచేవారు, కార్తిక పురాణం చదివినవారు, విన్నవారు కూడా పాపములు నశించి వైకుంఠమును చేరతారు. ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపచేసేదీ, ఆయురారోగ్య దాయినీ అయిన ఒక కథను వినిపిస్తాను, విను" అని చెప్పడం మొదలుపెట్టాడు.

మంధరోపాఖ్యానం
కళింగ దేశీయుడైన మంధరుడనే ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నిటినీ విడిచిపెట్టి ఇతరుల ఇళ్లల్లో కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పరమసాధ్వి అయిన ''సుశీల'' అనే పేరున్న భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా, ఆమెకు అతని పట్ల గౌరవమే తప్ప ద్వేషమన్నది ఉండేదికాదు. ఆమె ఎల్లప్పుడూ పాతివ్రత్య ధర్మమును పాటిస్తూ ఉండేది. కొన్నాళ్ళకు మంధరుడు తనకు వచ్చే తక్కువ ధనముతో జీవించడం కష్టమని భావించి, దారులు కాచి, బాటసారులను కొట్టి, వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసికెళ్ళి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మంధరుడు దారిన వెళ్తున్న ఒక బ్రాహ్మణుని పట్టుకుని, అక్కడి మర్రిచెట్టుకు కట్టేసి, అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక వేటగాడు, ధనం దోచుకున్న మంధరుని, ధనం పోగొట్టుకుని బందీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దర్నీ చంపి, ఆ మొత్తం ధనాన్ని అపహరించుకుపోయాడు. అదే సమయానికి నర వాసనను పసిగట్టి అక్కడకు ఒక పులి వచ్చింది. వేటగాడు పులిని చంపడానికి దానితో కలబడ్డాడు. కానీ కొద్దిసేపటికి పులి, వేటగాడు ఇద్దరూ చనిపోయారు. అలా మరణించిన విప్రుడు, మంధరుడు, పులి, వేటగాడు నలుగురూ యమలోకం చేరి, నరకబాధలు అనుభవించసాగారు.

సుశీలకి మునీశ్వరుని ప్రభోధం
ఇక్కడ భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మబుద్ధితో, హరి భక్తితో, సజ్జన సాంగత్యంతో జీవిస్తుండేది. ఒకరోజు ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేసెడివాడు, సకల ప్రాణికోటి యందు భగవంతుని దర్శించే ఒక మునీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి బిక్ష వేసి ''అయ్యా! నా భర్తపనిమీద పొరుగూరికి వెళ్లాడు. ఇంట్లో లేరు. నేను ఏకాకిని. ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను'' అని చెప్పింది.

అందుకా ముని ''అమ్మాయీ, బాధపడకు. ఈ రోజు కార్తిక పూర్ణిమ. ఇది మహా పర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ కాలక్షేపం ఏర్పాటు చేయి. అందుకోసం ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గరుంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే, దీపం వెలిగించవచ్చు'' అన్నాడు.

దీపారాధన
సుశీల ఆ ముని మాటలకు సరేనని, వెంటనే గోమయంతో ఇల్లంతా అలికి, పంచ రంగుల ముగ్గులను పెట్టింది. దీపారాధన కోసం పత్తిని శుభ్రం చేసి, రెండు వత్తులు చేసి, ముని వద్ద ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది.

పురాణ పఠనం
అప్పుడు ఆ ముని ఆ శ్రీహరిని దీపముతో పూజించి, మనః శాంతి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్లి, వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరితోపాటు తాను కూడా ఏకాగ్రతతో ఆ పురాణాన్ని విన్నది. తర్వాత ఆమెకు శుభాశీస్సులు అందించి మునీశ్వరుడు వెళ్లిపోయాడు. ప్రతినిత్యం శ్రీహరి పూజ చేయడం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి, కొంతకాలానికి మరణించింది.

సుశీల కోసం వచ్చిన విష్ణుదూతలు
వెంటనే శంఖ చక్రములను ధరించి, చతుర్భాహువులు, పద్మాక్షులు, పీతాంబర దారులు అయిన విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలో వచ్చిన నరకమునందు నరక బాధలు పడుతున్న తన భర్తను, మరి ముగ్గురిని గుర్తించి, విమానాన్ని ఆపించి, అందుకు గల కారణం ఏమిటో తెలియచేయమని విష్ణు దూతలను కోరింది.

నరకంలో భర్త సమాచారం తెలుసుకున్న సుశీల
అందుకు వారు ''అమ్మా! నీ భర్త అయిన మంధరుడు, బ్రాహ్మణుడు అయి కూడా వేదాచారాలను మరచి కొన్నాళ్లు కూలీగా, మరి కొన్నాళ్లు దొంగయై , దుర్మార్గుడైనందున ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి. మిత్రుని చంపి అతని ధనంతో పర దేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతని పాపాలకు గానూ అతడు నరకం పొందాడు. మూడవవాడు వేటగాడు. నీ భర్తచే బంధించబడిన బ్రాహ్మణుని, నీ భర్తను కూడా చంపి పాపానికి ఒడికట్టి, నరకం చేరాడు. ఇక నాల్గవ జీవి ఒక పులి. ఆ పులి కూడా పూర్వ పాపం వల్ల, నరకం చేరింది. వీరి నరకయాతనకు కారణాలు ఇవి'' అని వివరంగా చెప్పాడు.

అప్పుడు సుశీల విష్ణు దూతలను చూసి ''ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి'' అని కోరింది.

అప్పుడు విష్ణుదూతలు ''కార్తిక మాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వల్ల నీ భర్త, పురాణం వినమని చెప్పడానికి నువ్వు ఇంటింటికీ వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని ధారపోయడం వల్ల మిత్ర ద్రోహి అయిన ఆ విప్రుడు, పురాణ ప్రవచనం కోసం వెలిగించిన దీపానికి నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని సమంగా ధారపోయడం వల్ల వేటగాడు, పులి నరకం నుంచి ముక్తి పొందుతాయి'' అంటూ వివరించారు.

పుణ్యం ధారబోసిన సుశీల - మంధరునికి నరక బాధల నుంచి విముక్తి
అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను ధారబోయడం వల్ల ఆ నలుగురూ నరకం నుంచి విముక్తులై దివ్య విమానాలను ఎక్కి సుశీలను అనేక విధములుగా ప్రశంసిస్తూ మహా జ్ఞానులు పొందే ముక్తి పథానికి చేరుకున్నారు..

కనుక "ఓ జనక మహారాజా! కార్తిక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరి లోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో!" అని చెబుతూ వశిష్ఠుడు పదకొండవ రోజు కథను ముగించాడు.

ఇతి స్మాందపురాణ కార్తిక మహాత్మ్యే ఏకాదశాధ్యాయ సమాప్తః

ఓం నమః శివాయ!

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details