Karthika Mahapuranam Chapter 15 :వశిష్ఠులవారు పదిహేనవ రోజు కథను ప్రారంభిస్తూ జనకునితో "ఓ జనకరాజా! కార్తిక మాస మహత్యమును గురించి ఎంత వివరించినను తనివి తీరదు. కావున మరియొక కథను చెబుతాను శ్రద్ధగా వినుము" అని చెప్పసాగెను.
కార్తిక మాసంలో పవిత్ర తిథులు
కార్తిక మాసమున హరినామ సంకీర్తన చేయుట కానీ, వినుట కానీ, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట కానీ, వినడం కానీ సాయంత్రం వేళ దేవతా దర్శనం చేయలేనివారు కాలసూత్ర మనెడి నరకమున పడి కొట్టుకుంటుంటారు. కార్తిక శుద్ధ ద్వాదశి నాడు మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి, ధూప దీప నైవేద్యములు సమర్పించిన యెడల విశేష ఫలం పొందగలరు. ఈ విధంగా నెలరోజులు ఎవరైతే విడవకుండా చేస్తారో వారు దేవదుందుభులు మోగుతుండగా విమానమెక్కి వైకుంఠమునకు వెళుతారు. నెలరోజుల పాటు చేయలేని వారు కనీసం కార్తిక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజు లోనైనా నిష్టతో పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టవలెను.
ఇంకను వశిష్ఠుడు జనకునితో "ఓ రాజా! ఈ కార్తిక మాసంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే అన్ని పాపాలు పోయి మోక్షము కలుగును అందుకు ఉదాహరణముగా ఒక కథను చెబుతాను వినుము" అని చెప్పసాగెను.
మానవ రూపం పొందిన మూషికం
సరస్వతీ నది తీరమున ఒక పాడుబడిన శివాలయం ఉండేది. ఒకసారి కర్మనిష్ఠుడు అను సాధువు ఆ ఆలయమునకు కార్తిక మాసంలో వచ్చి అక్కడే నెలరోజులు ఉండదలచి, ఆ దేవాలయాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి, పక్క ఊరికి వెళ్లి ప్రమిదలు తెచ్చి, అందులో వత్తులు, నూనె వేసి పన్నెండు దీపములు వెలిగించి స్వామి వద్ద ఉంచి భక్తితో స్వామిని పూజిస్తూ, పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుకుతూ, తినడానికి ఏమి దొరకక పోయేసరికి అక్కడ ఆరిపోయి ఉన్న దీపం లోని వత్తిని తినదలచి దానిని నోట కరుచుకుని పక్కనే వెలుగుచున్న మరో దీపం వద్దకు వచ్చి ఆగెను. వెలుగుతున్న దీపం కాంతితో ఎలుక నోట ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగి దీపపు కాంతి వచ్చింది. అది కార్తిక మాసం కావడం వల్ల, వలన, శివాలయములో ఆరిపోయిన వత్తి ఎలుక ప్రయత్నపూర్వకంగా వెలిగించడం వలన ఆ మూషికం పాపములు హరించిపోయి వెంటనే అది మానవ రూపంలోకి మారింది.