Karthika Mahapuranam Chapter 14 :వశిష్ఠులవారు పద్నాలుగవ రోజు కథను ప్రారంభిస్తూ జనకుని తనకు దగ్గరగా కూర్చుండబెట్టుకుని, కార్తిక మాసము గురించి తనకు తెలిసినదంతా చెప్పాలన్న కుతూహలంతో ఈ విధముగా చెప్పడం ప్రారంభించాడు.
పితృదేవతలకు ప్రీతి కలిగించే వృషోత్సర్గము
వశిష్ఠుడు జనకునితో "ఓ రాజా! కార్తీకపౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్గము చేయవలెను. వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చు వేసి వదిలివేయుట. ప్రతి మనిషి పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చు వేసి వదులుతారా! అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతులై ఉండి కూడా పుణ్యకార్యములు, దాన ధర్మములు చేయక, చివరకు ఆబోతును అచ్చు వేసి కూడా వదిలి పెట్టరో అటువంటి వారికి భయంకరమైన నరక బాధలు తప్పవు. ఎవరైతే కార్తిక మాసంలో తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి, నిష్ఠతో కార్తిక వ్రతమాచరించి, సాయంకాలం వేళ శివకేశవుల ఆలయంలో దీపారాధన చేస్తారో వారు ఇహపరలోకములందు స్వర్గసుఖాలను అనుభవిస్తారు.
కార్తిక మాసంలో ఈ నియమాలు తప్పనిసరి
వశిష్ఠుడు జనకునికి కార్తిక మాసంలో పాటించాల్సిన నియమాలను గురించి సవివరంగా చెప్పారు.
- పరమ పవిత్రమైన కార్తిక మాసం మొత్తం ఇతరుల ఎంగిలి తినరాదు.
- శ్రాద్ధ భోజనం చేయరాదు.
- నీరుల్లిపాయ తినరాదు.
- నువ్వులు దానంగా తీసుకోకూడదు.
- శివార్చన చేయని వారి ఇంట భోజనం చేయరాదు.
- పౌర్ణమి, అమావాస్య తిథులలో, గ్రహణ సమయములలో, సోమవారం నాడు భోజనం చేయరాదు.
- వేడినీటి స్నానం కల్లుతో సమానము. కావున చన్నీటి స్నానము నదులలో కానీ చెరువులలో కానీ చేయాలి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగ, గోదావరి, సరస్వతి నదుల పేర్లు చెప్పుకుని ఇంట్లో వేడినీటితో స్నానం చేయవచ్చును.
- ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారు తప్పనిసరిగా జాగారం చేయాలి. పురాణములను విమర్శించరాదు.
- కార్తిక మాస వ్రతం చేయువారు పగలు పురాణం శ్రవణం, సాయంత్రం హరి కథలతో కాలక్షేపం చేయాలి.
- ప్రతిరోజూ శివుని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.
- శివాలయంలోకానీ, విష్ణువు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి. ఈ విధముగా చేసిన తర్వాత తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి, దక్షిణ తాంబూలాలు, దీపదానాలు ఇచ్చి సత్కరించాలి.