Kapila Theertham Kapileshar Temple :కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం, పుణ్యతీర్థం. ఈ ఆలయంలోని శివలింగం కపిల ముని ప్రతిష్టించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ శివుడు కపిలేశ్వరుడుగా పిలువబడుతూ పూజలందుకుంటున్నాడు.
స్థల పురాణం
ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.
సుందర జలపాతాలు ప్రశాంత వాతావరణం
తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనకు కపిలతీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడి సుందరమైన జలపాతం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు, ప్రశాంత వాతావరణం లో పరమశివుని దర్శనం అత్యంత మనోహరం అనిర్వచనీయం.
కపిలతీర్థం
ఈ ఆలయానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ కొండల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ప్రవహించే ఆకాశగంగను కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు.
జలపాతంలో పవిత్ర స్నానాలు
కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వలన ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కొంతమంది నేరుగా ఆకాశగంగా కిందనే పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలపాతం ఎంత సుందరమైనదో అంతే ఉద్ధృతమైనది. నేరుగా ఈ జలపాతం కింద శిరస్సును ఉంచి, స్నానం చేసిన వారికీ ఆ జలపాతం తాలూకు హోరు కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. ఆ అనుభూతిని ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి కానీ ఒకరు చెబితే తెలిసేది కాదు.
ఆలయ చరిత్ర
ఇక కపిల తీర్థం ఆలయ చరిత్రను పరిశీలిస్తే 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
నమ్మాళ్వార్ ఆలయం
ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే, అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. అందుకే కపిలతీర్థం ఆలయంలోనికి ప్రవేశించే ముందుగా మనకు నమ్మాళ్వార్ అనే ఆళ్వారు గుడి దర్శనమిస్తుంది. భక్తులు ముందుగా ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం శివుని దర్శనం కోసం వెళతారు.
దేవదాసి ప్రతిష్ఠిత వినాయకుడు
అలాగే పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేయడం సహా, అందులోనే వినాయకుడిని కూడా ప్రతిష్ఠించిందట.
ఎన్నో ఉపాలయాలు
కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఉపాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు.