తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

పాపులను శిక్షించే 'కల్కి'- శనివారం ఇలా పూజిస్తే శత్రు బాధలు దూరం! - Kalki Jayanti 2024 - KALKI JAYANTI 2024

Kalki Jayanti 2024 : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో చివరిది పదవ అవతారం అయిన కల్కి అవతారాన్ని పూజిస్తే శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. కలియుగాంతంలో పాపం విపరీతంగా పెరిగిపోయి సృష్టికే ప్రమాదం ఏర్పడిన స్థితిలో కల్కి భగవానుడు అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 10వ తేదీ కల్కి జయంతి సందర్భంగా కల్కి అవతార విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Kalki Jayanti 2024
Kalki Jayanti 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 5:10 PM IST

Kalki Jayanti 2024 :హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ శుద్ధ షష్టి రోజు కల్కి జయంతిగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీ కల్కి జయంతి రానుంది. కల్కి జయంతి రోజు కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు.

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఎప్పుడైతే అధర్మం పెచ్చు మీరి పోతుందో అప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి భగవంతుడు ఒక్కో యుగంలో ఒక్కో అవతారాన్ని స్వీకరిస్తాడు. శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణం ప్రకారం సత్య యుగంలోని సంధి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ మహా విష్ణుమూర్తి యొక్క ఈ అవతారం 64 కళలతో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతార విశేషాల గురించిన ప్రస్తావన ఉంది.

కల్కి జననం
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్​​లోని మొర్దాబాద్ సమీపంలోని సంభాల్ గ్రామంలో కల్కి భగవానుడు జన్మించాడని, ఆయన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉన్నారని తెలుస్తోంది. కల్కి తండ్రి కలియుగంలో గొప్ప విష్ణు భక్తుడు. ఆయనకు వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కల్కి తండ్రి పేరు విష్ణుయాష్, తల్లి పేరు సుమతి.

కల్కి భగవానునికి ఇద్దరు భార్యలు ఉంటారు. తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ. రెండో భార్య వైష్ణవి శక్తి రూపం. ఈమె త్రేతా యుగం నుంచి రాముని వివాహం చేసుకోవాలని తపిస్తూ వైష్ణోదేవిగా తపస్సు చేస్తుండగా కల్కి ఈమెను కలియుగంలో వివాహం చేసుకుంటాడు.

శ్వేత అశ్వవాహనం
దేవదూతగా భావించే శ్వేతాశ్వం కల్కి వాహనం. కల్కి భగవానుడు శ్వేతాశ్వంపై స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు.

కల్కి జయంతి పూజ ఇలా!
కల్కి జయంతి రోజున విష్ణుమూర్తిని కల్కి అవతారంగా భావించి పూజించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణులను యథాశక్తి పూజించి పేదలకు అన్నదానం చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనం.

రానున్న కల్కి జయంతి రోజు యథాశక్తి శ్రీమన్నారాయణుని కల్కి భగవానునిగా పూజిద్దాం శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుదాం.

జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

kalki avathaaram: రామయ్య సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు.. కల్కి అవతారంలో భక్తులకు దర్శనం

Srivari Navratri Brahmotsavam in Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. అశ్వ వాహనంపై విహరించిన శ్రీవారు

ABOUT THE AUTHOR

...view details