Kalabhairav Jayanti Significance In Telugu :ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటారు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపొతే వృధానే! ఎన్ని మందులు వాడినా ఫలితం లేని మొండి రోగాల నుంచి విముక్తి పొందడానికి, ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకోడానికి కాలభైరవ జయంతి రోజు కాలభైరవుని పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా కాలభైరవ జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ కాలభైరవుడు?
సాక్షాత్తు పరమశివుని స్వరూపాల్లో ఒక స్వరూపమే కాలభైరవుడు. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం ఒకానొక సందర్భంలో బ్రహ్మ, విష్ణువు మధ్య విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. ఈ వివాదాంశం గురించి మహర్షులు 'సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం ఒక్క మాటలో తేల్చి చెప్పడానికి వీలు కానిది. ఇందుకు కారణం విష్ణువు బ్రహ్మ ఇద్దరూ ఆ శక్తి విభూతి నుంచి ఏర్పడిన వారే కదా!' అన్నారు ఋషులు. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మ దేవుడు, విష్ణువు దేవతలందరితో పాటుగా శివుడిని సంప్రదించారు. ఆ సమయంలో దేవతలందరూ ఒకచోట కూర్చుని ఆ పరమేశ్వరుడే సృష్టికి మూలమని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీనిని అంగీకరించకుండా శివుని దూషించాడు. అప్పుడు శివుడు ఆగ్రహించి తన అంశతో ఐదవ రుద్ర అవృతారంగా కాల భైరవ అవతారాన్ని ధరించాడు. ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు కార్తిక బహుళ అష్టమి కావడం వల్ల ఆ రోజు "కాలభైరవాష్టమి" గా ప్రసిద్ధి చెందింది.
కాలభైరవాష్టమి ఎప్పుడు?
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు కాల భైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా నవంబర్ 22వ తేదీ శుక్రవారం రోజు కాలభైరవ జయంతి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా కాలభైరవ పూజ రాత్రి సమయాలలో నిర్వహిస్తారు కాబట్టి మనం వెళ్లే ఆలయంలో సమయాలను అనుసరించి కాలభైరవుని పూజించుకుంటే మంచిది.
కాలభైరవ స్వరూపం
పరమశివుని స్వరూపమైన కాలభైరవుడు ఉగ్రరూపంతో ఉంటాడు. కాలభైరవుని వాహనం కుక్క. అంతేకాదు పరమ పావనమైన కాశీ క్షేత్ర పాలకుడు కూడా కాల భైరవుడు. అందుకే వారణాశి వెళ్లిన వారు కాలభైరవుని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే ప్రతి శివాలయంలో కూడా కాలభైరవ విగ్రహం ఉంటుంది.