తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

జంబుకేశ్వరంలో 'జల లింగాన్ని' పూజిస్తే చాలు - సకల మనోభీష్టాలు నెరవేరడం ఖాయం - JAMBUKESWARAR TEMPLE

జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తే - ఈతిబాధలు తీరి, అష్టైశ్వర్యాలు కలగడం పక్కా

Jambukeswarar Temple
Jambukeswarar Temple (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 5:31 AM IST

Jambukeswarar Temple :పరమ పవిత్రమైన కార్తిక మాసంలో పంచభూత లింగ క్షేత్ర దర్శనంలో భాగంగా జల లింగమైన జంబుకేశ్వర క్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

జంబుకేశ్వరం ఎక్కడ ఉంది?
జంబుకేశ్వర క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి 11 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ వెలసిన స్వామి జంబుకేశ్వర స్వామి.

ఏనుగులచే పూజలందుకున్న క్షేత్రం
జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే ఈ క్షేత్రం ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రం కాబట్టి ఈ పేరు వచ్చిందని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా అంటే తెల్ల నేరేడు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చిందని కూడా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

స్థల పురాణం
ఈ ఆలయ స్థల పురాణం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

మొదటి కథ
మొదటి కథ ప్రకారం, పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవారు! అత్యంత శివభక్తుడైన శంభుడు శివుని పూజించనిదే మంచి నీరు కూడా స్వీకరించే వాడు కాదు!

శివుని ప్రత్యక్షంగా పూజించాలనుకున్న శంభుడు - ప్రత్యక్షమైన శివుడు
అలా పరమ శివ భక్త పరాయణుడైన శంభునికి ఒకరోజు శివుని ప్రత్యక్షంగా పూజించాలన్న కోరిక కలిగింది! వెంటనే శంభుడు శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు మొదలు పెట్టాడు. భక్త సులభుడైన ఆ బోళాశంకరుడు శంభుని తపస్సుకి మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో మన్నాడు. అప్పుడు శంభుడు తన మనోభీష్టం అయిన శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడు. అందుకు భోళాశంకరుడు అంగీకరించి తానిక్కడ లింగ రూపంలో వెలుస్తానని, శంభుడు జంబూ వృక్ష రూపంలో తనను పూజించుకోవచ్చునని చెప్పి అంతర్థానం అయ్యాడు. ఆనాటి నుంచి శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా, శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడని భక్తుల విశ్వాసం.

రెండవ కథ
ఇక మరో కథను పరిశీలిస్తే ఇది మనకు శ్రీకాళహస్తి స్థల పురాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. జంబుకేశ్వరం క్షేత్రంలో కూడా స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటీ పడి పూజిస్తుండేవి. వాటి అపారమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వాటికీ మోక్షాన్ని ఇచ్చాడు. ఈ ఇతిహాసం కూడా ప్రాచుర్యంలో ఉంది.

జంబుకేశ్వర ఆలయ చారిత్రక విశేషాలు
చారిత్రక ఆధారాల ప్రకారం సా.శ.11వ శతాబ్దములో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఆలయంలో స్వామికి నిత్య పూజాదికాలు, దీపధూపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఆలయ విశేషాలు
జంబుకేశ్వరం ఆలయ విశేషాలను పరిశీలిస్తే విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. ఇక్కడ జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు.

అద్భుతం! జంబుకేశ్వర మహాత్యం
జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కాదు. లింగం నీటిలో లేదు. అయితే లింగం యొక్క పానవట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు పూజారులు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పి ఉంచి, కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు. అందుకే ఈ క్షేత్రానికి జల లింగమని పేరువచ్చింది.

అఖిలాండేశ్వరి అమ్మవారు
స్వామి వారి గర్భగుడి సమీపంలోనే జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం, వరద ముద్రతో కనిపించే అమ్మవారి దర్శనం అపురూపం! సర్వ పాపహరణం.

ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపంగా మార్చిన ఆదిశంకరులు
గతంలో అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంతో ఉండేవారని, అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి శ్రీ అదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని మనకు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే అమ్మవారి ముందు మనకు కనబడే శ్రీ చక్రాన్ని కూడా ఆది శంకరాచార్యులవారే ప్రతిష్టించారని తెలుస్తోంది.

ఐశ్వర్య కారకం అమ్మవారి తాటంకాల దర్శనం
ఆదిశంకరులు స్వయంగా అమ్మవారికి తాటంకాలు అంటే కర్ణాభరణాలు అందించారని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి తాటంకాలను కూడా దర్శించాలి. అక్కడి పూజారులు కూడా మనకు చూపిస్తారు. అమ్మవారి తాటంకాలను దర్శించడం వలన సువాసినితనంతో బాటు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రవచనం.

ఇతర ఉపాలయాలు
ఇక్కడి అమ్మవారికి ఎదురుగా ఆదిశంకరుల వారు ప్రతిష్టించిన వినాయకుని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్, సంబంధర్ మొదలైనవారు స్వామిని సేవించి తరించారు. పరమ పవిత్రమైన జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది. ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించడం జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం ద్వారా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సకల ఈతి బాధలు తీరి పోవడానికి, దీర్ఘ సుమంగళి తనానికి, అష్టైశ్వర్యాలకు తప్పక దర్శించాల్సిన క్షేత్రం జంబుకేశ్వరం.

హర హర మహాదేవ శంభో శంకర! ఓం నమ శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details