Jaganmohini Kesava Swamy Temple :ప్రమోషన్లు, బదిలీలు ఇచ్చే శ్రీ జగన్మోహిని కేశవ స్వామి!ఎన్నో రోజులుగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసి విసిగిపోయి ఉన్నవారికి, కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ కావాలి అనుకునే వారికి శుభవార్త. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయాన్ని ఒక్కసారి సందర్శించి మీ కోరిక తెలుపుకుంటే 45 రోజుల్లో తప్పకుండా మీకు ప్రమోషన్, ట్రాన్స్ఫర్ అయి తీరుతుంది.
శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఎక్కడ ఉంది?
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉంది. ఈ గ్రామం గోదావరి నది ఉప నదులైన వశిష్ట, గౌతమీ నదుల మధ్య ఉంది.
అబ్బురపరిచే స్వామివారి విగ్రహం
సాలగ్రామ శిలగా వెలసిన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి విగ్రహం ఒకవైపు శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే, మరో వైపు జగన్మోహిని అవతారంలో చూపరులను అబ్బురపరుస్తుంది. ఒకే శిలలో ఇలాంటి అపురూపమైన విగ్రహం దేశంలో మరెక్కడా లేదు. ఈ విశేషాన్ని అద్దంలో చూడవచ్చు. అంతేకాదు, పద్మినీజాతి మహిళకు సహజంగా ఉండే పుట్టుమచ్చ ఈ జగన్మోహిని శిల్పానికి వెనుక భాగంలో ఉండి, భక్తులకు చక్కగా కనబడడం ఈ శిల్పం ప్రత్యేకత.
హరి పాదాలను కడిగే గంగ
ఇక్కడి మరో విశేషమేమేటంటే స్వామి వారి మూలవిరాట్టు పాదాల నుంచి గంగ ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది.
దేవతలే ఆలయాన్ని నిర్మించారా!
"స్వయంభు" మందిరంగా గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని దర్శించిన వారు, ఇది మానవ నిర్మితం కాదని సాక్షాత్తు దేవతలే ఈ ఆలయం నిర్మించారని విశ్వసిస్తారు. స్వామి వారి దివ్య దర్శనం నిజంగా ఈ అనుభూతిని ఇస్తుంది.
ఇతర దేవీదేవతలు
శ్రీ జగన్మోహిని కేశవ స్వామి మూలవిరాట్టు సమీపంలో శ్రీదేవి, భూదేవి, నారద మహర్షి, తుంబుర, రంభ, ఊర్వశి, కిన్నెర, కింపురుష, గోవర్ధనగిరి సహిత శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు, గరుడ, గంగాదేవి మొదలైన దేవీ దేవతలు కొలువై ఉంటారు.
ఆలయ స్థల పురాణం
లోక కల్యాణార్థం శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తినట్లు శ్రీమహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశం ర్యాలీ అని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. జగన్మోహినీని చుసిన పరమశివుడు మోహావేశానికి లోనై ఆమె వెంట పడగా, జగన్మోహిని శివుని చేతికి చిక్కక చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకం వచ్చి ఆగి శిలా రూపం దాల్చింది. అదే ర్యాలీ గ్రామంలో ఉన్న జగన్మోహినీ కేశవస్వామి దేవాలయం.
ఆలయ నిర్మాణం ఎలా జరిగింది?
పూర్వం ర్యాలీ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఒకనాడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఘంట చోళుడు అనే చక్రవర్తి వేట కోసం ఆ ప్రాంతానికి వెళ్లి అలసిపోయి విశ్రమించిన సమయంలో, ఎవరో హరి సంకీర్తన చేస్తున్నట్లు ధ్వనులు వినిపించాయి. కళ్లు తెరచి చూడగా అక్కడ ఎవరూ కనపడలేదు. ఆశ్చర్యపోయిన ఘంట చోళుడు వేట చాలించి వెనుతిరిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు కనిపించి ఒక రథాన్ని చేయించి రాజ్యంలో నడిపిస్తే ఆ రథం శీల ఎక్కడ ఊడిపడితే అక్కడ తవ్వకాలు జరిపిస్తే తన విగ్రహం కనిపిస్తుందని, ఆ విగ్రహానికి గుడి కట్టి పూజలు జరిపించమని చెప్పి అంతర్ధానమయ్యాడు. మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా చేయగా ఆశ్చర్యకరంగా రాజుకు జగన్మోహిని విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహానికి ఒకవైపు శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే, మరోవైపు జగన్మోహిని ఆకృతి ఉంది. స్త్రీ పుంభావ రూపంతో దొరికిన ఆ విగ్రహానికి ఆ రాజు అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు.
ఒక్కసారైనా తప్పక దర్శించుకోవాల్సిసిన దేవాలయం!
అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో స్వామిని దర్శించుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, కోరుకున్న చోటుకు బదిలీలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఆలా కోరిన కోరిక తీరినవారు తప్పకుండా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయ ప్రత్యేకతే ఇదే! కాబట్టి ప్రమోషన్లు, బదిలీలు కోరుకునే వారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి మీ కోరికలు తీర్చుకోండి.
శనివారం ఉప్పు, నూనెను కొంటున్నారా? అయితే కష్టాలు తప్పవ్! - Things Do Not Do On Saturday
ఇంట్లో పూజించే వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలో తెలుసా? - వాస్తు ఏం చెబుతోంది? - Lord Ganesh Vastu Tips