Jad Bharat Story In Telugu : పూర్వంలో ఋషభుడనే రాజుకు కుమారుడు జడ భరతుడు. 'జడ' అంటే నిశ్చలం దేనికి చలించినది అని అర్థం. జడభరతుడు రాకుమారుడైనా అందరిలా భోగాల మీద, విలాసాల మీద ఆసక్తి లేకుండా దైవభక్తి పరాయణుడై ఉండేవాడు. జడ భరతునికి సహజంగా వేటి మీదా ఆసక్తి లేకపోయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన తండ్రి తదనంతరం రాజ్యపాలన చేయాల్సి వచ్చింది. ఎన్నో సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా పరిపాలించిన భరతుని పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా ఉన్నారు. ఓ వైపు పరిపాలన చేస్తూనే, జపధ్యానాలలో మునిగి తేలేవాడు.
వానప్రస్థం
కాలక్రమంలో భరతునికి వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు రాజ్య బాధ్యతలను తన కుమారులకు అప్పగించి భరతుడు ప్రజా జీవనానికి దూరంగా ఒక నదీతీరానికి వెళ్లి, అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకోసాగాడు. జన్మరాహిత్యాన్ని అంటే పునర్జన్మ లేకుండా ఉండే వరాన్ని కోరుకుంటూ ఆయన చేసిన తపస్సుకు ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించాడు. ఇక భరతునికి మోక్షాన్ని ప్రసాదించాలని అనుకున్నాడు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన భరతుని జీవితాన్నే మార్చి వేసింది.
జడ భరతుడు రోజూ నదిలో స్నానం చేసి ఒడ్డునే కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటు. రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా భరతుడు స్నానం చేసి ధ్యానం చేసుకుంటుండగా నిండు చూలింత అయిన లేడి ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది. ఆ లేడికి సమీపంలోనే పులి గాండ్రింపు వినపడింది. అదే సమయంలో ఆకాశంలో పెద్ద ధ్వనితో పిడుగు పడింది. ఈ రెండు సంఘటనలకు బెదిరిపోయిన లేడి భయంతో ఒక్క గంతు వేసింది. ఆ దెబ్బకు దానికి ప్రసవం జరిగి లేడి పిల్ల పుట్టింది. తల్లి లేడి మాత్రం నదిలో మునిగి చనిపోతుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న జడ భరతుడు అక్కడికి వెళ్లేసరికి లేడిపిల్ల కూడా నదిలో మునిగిపోసాగింది. వెంటనే భరతుడు లేడిపిల్లను రక్షించి చేరదీశాడు. తల్లి కూడా లేని ఆ పసికూనను కొద్ది రోజులు పెంచి అడవిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.