Dhanurmasam 2024 : కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం ఎంతో విశిష్టమైనది. ఈ కథనంలో ధనుర్మాసానికి ఎందుకంతటి విశిష్ట వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు చేయవచ్చా? ఈ మాసానికి శూన్య మాసమని ఎందుకు పేరు వచ్చింది? తదితర వివరాలను తెలుసుకుందాం.
ధనుర్మాసం అంటే?
డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని అంటారు.
విష్ణు పూజ - బాలభోగం
ధనుర్మాసం విష్ణు పూజకు చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ధనుర్మాసంలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.
ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత?
దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, పొంగల్ ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.
దారిద్య్రాన్ని దూరం చేసే లక్ష్మీ పూజ
ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రం దూరమవుతుందని విశ్వాసం.