Interesting Stories Behind Bathukamma Festival :చారిత్రక ఆధారాల ప్రకారం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించే కాలంలో వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపుడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపుడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపుడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పట్లో వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఇప్పటికీ ఇది ప్రఖ్యాతి చెందిన ఆలయం.
రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిన సుందర చోళుడు
ఆపదల్లో ఉండే వారికి రాజరాజేశ్వరి దేవి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందర చోళుడు కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళడు తన కుమారుడికి 'రాజరాజ' అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళుడే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన 'రాజేంద్రచోళ' సత్యాశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు.
తండ్రికి శివలింగాన్ని బహుమతిగా ఇచ్చిన రాజేంద్రచోళ
రాజేంద్రచోళ తాను సాధించిన విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి, అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ.
వేములవాడ నుంచి బృహదీశ్వరాలయానికి చేరిన శివలింగం
క్రీ.శ.1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదీశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు వివరించడం ఈ సంఘటనకు అద్దం పడుతుంది. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు.
పార్వతి నుంచి వేరయిన శివయ్య
వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతమంత ఎత్తులో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు.