తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కష్టాలు తీరలేదని తరచూ దేవుళ్లను మారుస్తున్నారా? ఇది చదివితే మీలో బిగ్ ఛేంజ్ పక్కా​! - IMPORTANCE OF PRAYING GOD

దేవుళ్లను తరచూ ఛేంజ్ చేస్తున్నారా?- భగవంతుని ఉనికి గురించి చెప్పే కథ మీకోసం!

Importance Of Praying God
Importance Of Praying God (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 5:02 AM IST

Importance Of Praying God : సాధారణంగా దైవాన్ని అందరూ విశ్వసిస్తారు కానీ కష్టకాలంలో దేవుడే దిక్కని భగవంతుని ఆశ్రయించడం సర్వసాధారణం. చాలా మందికి కష్టమొస్తేనే దేవుడు గుర్తొస్తాడు. అందుచేతనే దేవుడు ఎప్పుడూ గుర్తు రావాలనే కుంతీదేవి తనకు ఎప్పుడూ కష్టాలు కలగాలని కోరుకుంది. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే దేవుణ్ని కొలుస్తారు. అయితే కోరిన కోర్కెలు తీరలేదనో, అనుకున్నది జరగలేదనో కొంతమంది తరచుగా దేవుళ్లను మారుస్తూ ఉంటారు. ఇది తప్పని ఈ కథనం పూర్తిగా చదివిన తర్వాత తెలుస్తుంది.

దేవుడే దిక్కని తలచి!
ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా బాదర బందీ పెరిగి బ్రతుకు భారమైన సమయంలో గుర్తొచ్చేది దేవుడొక్కడే! ఆ సమయంలో దేవుడే దిక్కని భావించి ఆయన్ను ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం. కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు వస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపించిన ప్రతి దేవుడికి మొక్కులు మొక్కుతాం. ఒకవేళ మన బాధలు తీరకపోతే సులభంగా దేవుళ్లని మార్చేస్తూ ఉంటాం. ఇది ప్రస్తుత సమాజంలో సహజంగా జరుగుతున్న విషయం. ఈ కథలోని నీతిని గ్రహించగలిగే తరచుగా దేవుళ్లను మార్చే వారు తమ పొరపాటును గ్రహిస్తారు.

కష్టాలలో గుర్తొచ్చిన దేవుడు
చాలాకాలం క్రితం జరిగిన సంఘటన. ఇది వాస్తవంగా జరిగిన సంఘటనే అని అంటారు. అయితే అందుకు స్పష్టమైన ఆధారాలేమీ లేవు. పూర్వం ఒక పెద్ద మనిషికి అనుకోకుండా చాలా కష్టాలొచ్చాయి. ఏ పని చేయబోయినా, ఎక్కడకు వెళ్లినా చుక్కెదురవుతోంది. ఆ పరిస్థితి నుంచి బయట పడాలంటే భగవంతుని ఆశ్రయించాలని ఆయన ఒక గురువు ద్వారా తెలుసుకున్నాడు. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది ఆ గురువు ఏమో నీ ఇష్ట దైవాన్ని ఆరాధించామని చెప్పాడు. ఇతనికేమో అప్పటి వరకు ఎలాంటి ఇష్ట దైవం లేదు. ఇక ఏ దేవుని పూజించాలనే సందేహం కలిగింది.

శివారాధనతో శ్రీకారం
శివుడు భోళా శంకరుడు కదా భక్తులు పిలవగానే పలుకుతాడని ఎవరో చెబితే వెంటనే ఒక శివలింగాన్ని కొని ఇంటికి తెచ్చి రకరకాల అభిషేకాలు చేశాడు. కానీ పాపం ఆయన బాధలు తీరలేదు.

కృష్ణ మాయ
ఇంతలో అతడికి ఎవరో కృష్ణుడు అద్భుత లీలలు, మహిమలతో భక్తులను కాపాడుతాడని, ఏదో ఒక అద్భుతం చేసి నిన్ను కూడా కాపాడతాడని చెప్పారు. అంతే! వెంటనే ఆయన శివ లింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడిని పూజించడం మొదలు పెట్టాడు. రేయింబవళ్లు కృష్ణ ధ్యానంలో మునిగిపోయాడు. కానీ పాపం ఈసారి కూడా ఈయన కష్టాలు తీరలేదు.

బొజ్జ గణపయ్య పూజ
ఇంతలో వినాయక చవితి వచ్చింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా కోరిన కోరికలు తీరాలంటే వినాయకుని పూజించాలని ఇతరులు చెప్పిన మాటలు విశ్వసించి ఆయన గణపతి ఆరాధన మొదలెట్టాడు. ధూపదీప నైవేద్యాలతో, వినాయకునికి ప్రియమైన నైవేద్యాలతో వినాయకుణ్ని పూజించాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ ఈయన కోరికలు తీరలేదు. ఈతి బాధలు తగ్గలేదు.

హనుమ ఆరాధన
ఈయన బాధలు చూడలేక మిత్రులు కొందరు ఆంజనేయుడయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయనను పూజించమని సలహా ఇచ్చారు. ఈయనకీ ఇది నిజమే అనిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించడం మొదలెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, కఠిన నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే ఘోటక బ్రహ్మచర్యం పాటిస్తూ పూజించాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం.

అమ్మవారి ఆరాధన
ఏ పూజ ఫలించకపోవడం వల్ల విసుగెత్తిన అతడు ఈ దేవుళ్లు అందరూ ఇంతే! మగ దేవుళ్లు సులభంగా కరగరు, అమ్మవారికైతే కరుణ, ప్రేమ ఎక్కువ. తల్లిలా ఆదుకుంటుందని అమ్మనుకొలవాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఫలించిన పూజ
అయితే ఆయన సుకృతమో, కాలం కలిసొచ్చిందో అంతకాలం ఆయన అనుభవించిన కష్టాలు తీరాయి. కోరిన కోరికలు నెరవేరాయి. సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలిగాయి. ఇక అమ్మ మీద భక్తి విశ్వాసాలు పెరిగిపోయాయి. ఇలా కాలం సుఖంగా గడిచిపోసాగింది.

దేవుళ్ల ముఖాలకు వస్త్రాలు
ఒకరోజు అతడు యథావిధిగా అమ్మవారిని పూజిస్తూ అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం, తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు. తన కష్టాలు తీర్చని ఆ దేవుళ్లకు ఈ ధూపం ఆఘ్రాణించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను వస్త్రాలతో కప్పేశాడు.

ఆశ్చర్యం! అద్భుతం!
అప్పుడు మళ్లీ అమ్మవారిని ధ్యానిస్తూ కళ్లు మూసుకున్నాడు. కొంతసేపయ్యాక కళ్లు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ఇతనిని చూసి ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్లని చూసి ఇతను ఆశ్చర్యపోయాడు.

దేవుళ్లను నిలదీసిన భక్తుడు
ఆ భక్తుడు నెమ్మదిగా ఆశ్చర్యం నుంచి తేరుకుని 'నేను మిమ్మల్నందరినీ చాలా కాలం శ్రద్ధగా, భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు. రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు, నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు వస్త్రాలు కట్టాను' అని ఆయన వారిపై తనకున్న కోపాన్ని ప్రదర్శించాడు.

ఆధ్యాత్మిక జ్ఞానం బోధించిన శివుడు
తమపై కోపగించిన భక్తుని చూసి శివుడు 'నాయనా అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే ధూపం ఆఘ్రాణించకూడదని ముక్కుకు, నోళ్లకు వస్త్రాలు కట్టావు. మేము ఇక్కడ సజీవంగా ఉన్నామన్న నీ విశ్వాసం చూసి మేము నీకు దర్శనమిచ్చాం' అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టు చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్థానమయ్యారు. ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే భగవంతుణ్ని విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి. ఆరాధించాలి. అప్పుడే వారి అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది.

అమ్మవారిచే ప్రసాదం తినిపించిన పరమహంస
ఒకసారి రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్ళాల్సి వచ్చింది. ప్రసాదం తీసుకొని గుడికి వెళ్లి అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. సామాన్యంగా అమ్మవారు రోజు ప్రసాదం తింటుందనే ఆయన భావించాడు. అమ్మవారు తినకపోయేసరికి 'రోజూ తినే దానివి ఈ రోజు తినవేమి? నువ్వు తింటే కానీ ఇక్కడ నుంచి వెళ్లనన్నాడు. తాను నిజంగానే నైవేద్యం తింటానన్న అతని దృఢ విశ్వాసానికి అమ్మవారు మెచ్చి ఆ నైవేద్యం తిన్నది. అదీ విశ్వాసమంటే!

కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో ముందుగా కష్టాలను ఎదుర్కోగల ధైర్యం లభిస్తుంది క్రమంగా కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకు కావాల్సింది దైవంపై అచంచలమైన భక్తి విశ్వాసాలు మాత్రమే! అందుకే మార్చాల్సింది దేవుళ్లను కాదు. మనల్ని మనం మార్చుకోవాలి. దేవుని రాతి విగ్రహంగా కాకుండా ప్రత్యక్ష దైవంలా భావిస్తే భక్తి పరిపక్వత చెందుతుంది. క్రమంగా భగవంతుని దర్శనం కలుగుతుంది. శుభం భూయాత్!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details