Importance Krodhi Nama Samvatsaram :తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగకు ఎంతో విశిష్టత ఉంది. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉన్నాయి. అందులో 38 వ సంవత్సరం, కలియుగంలో 5,125వ సంవత్సరమే శ్రీ క్రోధి నామ సంవత్సరం. 2024 ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం క్రోధి నామ సంవత్సరం లోకి అడుగు పెట్టబోతున్నాం.
క్రోధి నామ సంవత్సరంలో క్రోధం పెరుగుతుందా?
అవుననే అంటున్నారు పంచాంగ కర్తలు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపతాపాలతో, ఆవేశంతో ఉంటారని పంచాంగ కర్తలు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరగడం, మనస్పర్థలు కలగడం వంటివి ఉంటాయని పండితులు వివరిస్తున్నారు.
రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంటుందా?
క్రోధి నామ సంవత్సరంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడడం, ఆవేశాలు పెరగడం వలన ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
దేశాల మధ్య యుద్ధ వాతావరణం!
క్రోధి నామ సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య కోపాలు, ఆవేశాలు, కలహాలు పెరిగి యుద్ధ వాతావరణం ఉండబోతోందని పంచాంగకర్తలు హెచ్చరిస్తున్నారు.
పరిహారాలు ఏమిటి?
క్రోధి నామ సంవత్సరంలో కోపతాపాలు, ఆవేశాలు పెరిగే ఆస్కారం ఉన్నందున ప్రజలంతా సంయమనంతో మెలగాలని పండితులు సూచిస్తున్నారు. నవగ్రహ పూజలు, అభిషేకాలు జరిపించుకోవడం వలన శాంతి నెలకొంటుందని పెద్దలు చెబుతున్నారు. బ్రాహ్మణులకు దానాలు, పేదలకు విరివిగా దానధర్మాలు, అన్నదానం వంటివి చేయాలి. అలాగే కోపాన్ని నియత్రించుకోడానికి శ్రీలక్ష్మీ నృసింహ ధ్యానం, నరసింహ స్వామికి పూజలు చేయడం వలన ఎంత గొప్ప కోపాన్నైనా అదుపులో ఉంచుకోవచ్చు, తద్వారా కుటుంబంలో, సమాజంలో, దేశంలో శాంతి, సుఖాలు తప్పకుండా వెల్లి విరుస్తాయని పంచాంగ కర్తలు చెబుతున్నారు. కాబట్టి మనందరం పంచాంగకర్తలు, పండితులు సూచించిన ఈ పరిహారాలను పాటిస్తూ కోపాన్ని వీడి ఈ క్రోధి నామ సంవత్సరం అంతా ఆనందంగా, సుఖశాంతులతో ఉందాం. శుభం భూయాత్
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.