How To Pray God In Hinduism :వ్యాస మహర్షి రచించిన బ్రహ్మ పురాణం ప్రకారం భక్తి మార్గం ఒక్కటే మనల్ని భగవంతుని దగ్గరకు చేర్చే సులభ మార్గం అని తెలుస్తోంది. ప్రతిరోజూ ఏ పని చేస్తున్నా మనసులో భగవన్నామ స్మరణం చేస్తూ, చేసే ప్రతీ పని భగవంతుని సేవగా, సంపాదించిన ప్రతీ రూపాయి భగవంతుని ప్రసాదంగా భావిస్తే ఆ దేవుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అందుకు ఉదాహరణగా నిలిచే ఈ కథను తెలుసుకుందాం.
ఢమరుక మల్లన్న
తమిళనాడులో ఓ మారుమూల ప్రాంతంలో శివుని కోసం ఢమరుకాలు తయారు చేసే మల్లన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పంచమ కులానికి చెందినవాడు. జంతు చర్మాలను శుభ్రపరచి వాటితో ఢమరుకాలు తయారు చేయడం అతని వృత్తి. ఈ మల్లన్నకు శివ భక్తి ఎక్కువ. నిద్రలేచిన దగ్గర నుంచి ఏ పని చేస్తున్నా శివనామ స్మరణం నిరంతరం చేస్తుండేవాడు. తాను చేసే వృత్తినే దైవంగా భావించి తన పని పట్ల చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఉండేవాడు.
శివ దర్శనం కోసం తపన
మల్లన్నకు చిన్నతనం నుంచి శివాలయంలోకి వెళ్లి దర్శించుకోవాలన్న కోరిక బలీయంగా ఉండేది. అయితే ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్ల కారణంగా మల్లన్న కోరిక తీరలేదు. అందుకు అతడు చాలా ఆవేదన చెందుతుండేవాడు. శివ దర్శనం చేయాలన్న కోరిక రోజు రోజుకి పెరిగి పెద్దదయింది.
మల్లన్నకు లభించని శివ దర్శనం
ఒకరోజు మల్లన్న ఎలాగైనా శివ దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకొని శివాలయానికి వెళ్లాడు. అయితే మల్లన్న పంచముడు కావడం వల్ల ఆ రోజుల్లో ఉన్న ఆలయ కట్టుబాట్ల ప్రకారం పూజారి అతడిని ఆలయం లోనికి అనుమతించలేదు. చేసేదిలేక మల్లన్న ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిలబడి శివుణ్ణి ప్రార్ధించడం మొదలు పెట్టాడు.
మల్లన్నను దండించిన పూజారి
ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిలబడి మల్లన్న, శివుణ్ణి ప్రార్ధించడం చూసి సహించలేని పూజారి అతడిని ఒక దుడ్డు కర్రతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు అతడు స్పృహ తప్పి పడిపోయాడు.
గర్భగుడి నుంచి వినిపించిన శివ వాణి
ఇంతలో ఆశ్చర్యకరంగా దేవాలయం ప్రధాన ద్వారం తలుపులు మూసుకుపోయాయి. తలుపులు తెరవడానికి ఎవరెంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఆ సమయంలో గర్భగుడిలో నుంచి శివ వాణి వినిపిస్తుంది. "మీరు నా భక్తుని కొట్టి తప్పు చేసారు. అతడిని నా దర్శనానికి తీసుకు వస్తే మూసుకున్న తలుపులు తెరుచుకుంటాయి" అని చెప్తారు.
మల్లన్న దర్శనానికి తెరుచుకున్న తలుపులు
చేసిన తప్పు తెలుసుకున్న ఆలయ పూజారులు, మల్లన్నను క్షమించమని వేడుకుంటూ అతడిని శివ దర్శనానికి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు తీసుకురాగానే తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి.
మల్లన్న శివైక్యం
ఢమరుకాలు తయారుచేసే మల్లన్న, నటరాజ స్వామిని దర్శించాడు. తరువాత అతడు ప్రాణాలు విడిచి శివయ్యలో ఐక్యమయ్యాడు. శివయ్య మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్న మల్లన్నకు ఎందరో మునులు రుషులకు సాధ్యం కానీ శివైక్యం దక్కింది.