Puja at Tulasi Kota on Kartika Poornami: హరిహరులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తికం. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధాన, దీప దానాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఇక ఈ నెల మొత్తంలో ఒక్కోరోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. ఈ రోజున చంద్రుడికి పూర్తిగా శక్తి లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్‌కుమార్ చెబుతున్నారు. అయితే ఈ రోజున సాయంత్రం తులసికోట దగ్గర తల్లులు ఈ పూజ చేస్తే సంవత్సరం మొత్తం పిల్లల జీవితం బాగుంటుందని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతున్నారు. మరి ఆ పూజ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పూజ చేసే విధానం:
- కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం తలస్నానం చేసి తులసి కోట ముందు అలికి ముగ్గులు పెట్టుకోవాలి.
- అలాగే పుష్పాలతో తులసి కోటను అలంకరించుకోవాలి. ఆ తర్వాత మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపారాధన చేయాలి.
- దీపారాధన అనంతరం ఉసిరిక దీపాలు వెలిగించాలి. అంటే ఉసిరికాయ పైన చెక్కును కొద్దిగా తీసి.. ఆవు నేతిలో ముంచిన కుంభ వత్తిని దాని మీద ఉంచి దీపాలు వెలిగించాలి.
- ఉసిరిక దీపాలు వెలిగించిన అనంతరం ఓ తమలపాకును తులసి కోట వద్ద ఉంచాలి. ఆ తమలపాకులో ఓ రాగి నాణెం లేదా రూపాయి బిళ్లను ఉంచాలి. ఆ తర్వాత దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ నాణెంను సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించాలట!.
- ఆ తర్వాత "ఓం సోం సోమాయ నమః" అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ రాగి నాణెం లేదా రూపాయి బిళ్లను పూలు, అక్షతలతో పూజించాలి.
- ఆ మంత్రం చదివిన తర్వాత అగరబత్తీలు వెలిగించి, హారతి చూపించాలి. అనంతరం అరటిపండు ముక్కలు, చలివిడి, పాలల్లో అటుకులు కలిపి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత వాటిని పిల్లలకు తినిపించాలి.
- అనంతరం ఆ రాగి నాణెం లేదా రూపాయి బిళ్లకు నమస్కారం చేసి ఆ బిళ్లను తీసుకుని ఇంట్లో మీ పిల్లలు చదువుకునే గదిలో పెట్టాలి. అలా డైరెక్ట్‌గా పెట్టకుండా ఓ గిన్నె తీసుకుని అందులో నాణెం పెట్టి గదిలో ఉంచాలి.
- ఆ తర్వాత వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం వేసి కలిపి ఓ 15 నిమిషాల పాటు ఆ పాలను వెన్నలలో ఉంచి అనంతరం తులసి కోట వద్ద పెట్టి నమస్కారం చేసిన తర్వాత ఆ పాలను కూడా పిల్లలతో తాగించాలి.
- కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం తులసి కోట దగ్గర ఇలా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ల పిల్లలపై చంద్రబలం పూర్తిగా ఉండి.. సంవత్సరమంతా పిల్లల జీవితం బాగుంటుందని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతున్నారు.