తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు అవకాశవాదులకు దూరంగా ఉండాలి - లేకుంటే ప్రమాదం - శివారాధన శ్రేయస్కరం!

అక్టోబర్ 30వ తేదీ (బుధవారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Horoscope Today 30th October 2024 : 2024 అక్టోబర్ 30వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా వేసే ప్రతి అడుగు విజయాన్ని చేకూరుస్తుంది. ముఖ్యమైన సదస్సులకు హాజరవుతారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. ఈ రోజు ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. దీనితో సంతోషంగా ఉంటారు. మీ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. ఈ సమావేశం వృత్తిపరంగా ముందుకెళ్లడానికి సహకరిస్తుంది. వ్యాపారపరంగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కమ్యునికేషన్, మీడియా రంగాల వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. వృత్తిపరంగా నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి పరంగా ఎదగడానికి ఈ పరిచయాలు దోహదపడతాయి. ఈ రోజు నిర్వహించే ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే ఆటంకాలను సమర్థవంతంగా తిప్పి కొడతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తీరి లాభాలు అందుకుంటారు. బుద్ధిబలంతో ఓ కీలక విషయంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భావోద్వేగాలను, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అవసరం. ముఖ్యంగా మీ బలహీనతలే మీకు శత్రువులుగా మారే ప్రమాదముంది. అవకాశవాదులకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పనిభారం పెరగుతుంది. దీనితో ఒత్తిడికి లోనవుతారు. స్నేహితుల కోసం, విలాసాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. నీటిగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే దురలవాట్లను మానుకోండి. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు సోదరుల నుంచి లబ్ధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వ్యాపార సంబంధ చర్చలు జరుపుతారు. కొత్త ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. అదృష్టం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారు చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పోటీదారులు, ప్రత్యర్థులు మీతో పోటీకి దిగలేక పక్కకు తప్పుకుంటారు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు ఎదురు కావడంతో దిగులు చెందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు. వృత్తి పరంగా దూర ప్రాంతాల సంస్థలతో, వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వ్యాపారంలో ఆదాయం ఆశించిన మేరకు ఉండదు. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మృదువైన మాటలతో, చక్కని పనితీరుతో అందరినీ ఆకర్షిస్తారు. ఇది వృత్తి పరంగా మీకు అనేక రకాలుగా లాభాలను తెచ్చి పెడుతుంది. మీ తెలివితేటలకు, సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరంగా, కుటుంబపరంగా శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగానే ఉంది. కాకపోతే ఆరోగ్యంపై కాస్త దృష్టి పెట్టంది. లేదంటే సమస్యలు ఎదురవ్వొచ్చు. పనిపట్ల ఏకాగ్రతతో ఉండండి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయొద్దు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం వరించి ఈ రోజు అన్ని విధాలా సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. లక్ష్మీకటాక్షం ఉంటుంది. సిరిసంపదలు ఇంటికి వస్తాయి. అవివాహితులకు ఇది శుభప్రదమైన రోజు. కోరుకున్న వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది. పారిశ్రామికవేత్తలు ఆర్థికపరంగా శుభ ఫలితాలను అందుకుంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. పరోకారంతో సమాజానికి మేలు చేసే కార్యక్రమాలలో పాల్గొంటారు. అందరి ప్రశంసలు పొందుతారు. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. ఈ రోజు ఏ పని చేపట్టినా విజయం మీ వెన్నంటే ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో కీలక బాధ్యతలు చేపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గురు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున వృత్తిపరంగా అంతర్గతంగా వుండే ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మంచి రోజు. కళాకారులు, రచయితలు సృజనాత్మకంగా ఆలోచించి మంచి నైపుణ్యం ప్రదర్శించగలరు. స్వల్ప అనారోగ్య సమస్యలుండే అవకాశముంది. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా అనేక ఇబ్బందులు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కోపావేశాలకు లోను కాకండి. దైవారాధనలో గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ వాదనలు దిగవద్దు. వ్యాపారంలో రుణబాధలు ఎక్కువవుతాయి. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మేలు జరుగుతుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. కళారంగంలో వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుంది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details