Kanuma Festival Significance :నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగ. ప్రకృతిని దైవంగా భావించి పూజించే కనుమ పండుగ ప్రధానంగా కర్షకుల పండుగ. ఈ సందర్భంగా కనుమ పండుగ విశిష్టత ఏమిటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాడిపంటలు పండుగ
మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజున కనుమ పండుగగా జరుపుకుంటాము. కనుమ పండుగ ముఖ్యంగా కర్షకుల పండుగ. ఈ రోజున పాడి పంటలను, పశుసంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయం.
సంప్రదాయ రీతిలో కనుమ
కనుమ పండుగ రోజు కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది. కనుమ పండుగ రోజున తప్పకుండా తలంటు స్నానం చేయాలి. శాస్త్రవచనం ప్రకారం కనుమ రోజున కాకి కూడా మునుగుతుందంటారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి.
ఆడపడుచులకు పసుపుకుంకుమలు
కనుమ పండుగ రోజున ఆడపడుచులకు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని అంటారు. అంటే మినపప్పుతో చేసిన గారెలు వంటివి. ఆయుర్వేదం ప్రకారం చూస్తే మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. శీతాకాలంలో మినప గారెలు తినడం ఆరోగ్యానికి మంచిది. నిజానికి పండుగల పేరుతో మనం చేసుకునే ప్రతి వేడుకకు ఒక శాస్త్రీయత ఉంటుంది.
పశువుల పండుగ
కనుమ పండుగ రోజున సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి, పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి, వాటి మెడలో రంగురంగుల పూసలు, గంటలు కట్టి అలంకరిస్తారు.
అలరించే గంగిరెద్దుల వారు
కనుమ రోజు గంగిరెద్దుల వారు విశేషంగా ఇల్లిల్లూ తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం, వస్త్రాలు వంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు. ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం.