తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

జీవితంలో ఒక్కసారి దర్శించినా చాలు - మోక్షం ఖాయం - ప్రయాగ్​రాజ్​ విశిష్టత ఇదే! - PRAYAGRAJ TRIVENI SANGAM

త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం ఖాయం- ప్రయాగ్​రాజ్ విశిష్టత మీకోసం

Prayagraj Triveni Sangam
Prayagraj Triveni Sangam (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 5:00 AM IST

Prayagraj Triveni Sangam significance: ప్రపంచమంతా తరలి వస్తున్న మహా కుంభమేళా జరిగే ప్రయాగ్‌రాజ్‌ భూలోక ధామంగా ప్రసిద్ధి చెందింది. కుంభమేళా లేని సమయంలో కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు ఏడాది మొత్తం వస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.

పురాణం ప్రాశస్త్యం
ప్రయాగ క్షేత్ర ప్రాశస్త్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలూ విపులంగా వివరిస్తున్నాయి. క్షీరసాగర మధనంలో లభించిన అమృత భాండం తీసుకుని విష్ణువు తరలి వెళ్లే సమయంలో మార్గ మధ్యంలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్‌ అనే నాలుగు ప్రదేశాలలో అమృత బిందువులు చిలకరించాడంట! అందుకే ఈ ప్రాంతాలలో కుంభమేళాలు జరుగుతుంటాయి.

పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్​లో జరుగుతుంది. అందుకే ప్రయాగ్‌రాజ్‌కు అంతటి ప్రాశస్త్యం. పద్మపురాణం ప్రకారం ప్రయాగ్‌రాజ్‌ మాఘ స్నానం అత్యంత పవిత్రమైనదని తెలుస్తోంది.

ప్రయాగ్‌రాజ్‌ విశిష్టత
ప్రజాపతి బ్రహ్మ ప్రయాగ్‌రాజ్‌లో అనేక యాగాలు చేయడం వల్ల ఈ ప్రాంతానికి ప్రయాగ అని పేరు వచ్చిందని తెలుస్తోంది. ప్రయాగరాజ్ అనే శబ్దాన్ని పలికినంత మాత్రాన్నే సకల పాపాలు పటాపంచలై పోతాయని శాస్త్రం చెబుతోంది. ఇక ప్రయాగ్‌రాజ్‌లోని గంగ యమునా సరస్వతి నదుల సంగమస్థానం త్రివేణి సంగంలో స్నానం మోక్షదాయకని అంటారు. అలాగే ఇక్కడ పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలకు ఉత్తమగతులు లభిస్తాయని, వంశాభివృద్ధి కలుగుతుందని అంటారు.

దానధర్మాలు శ్రేష్టం
ప్రయాగ్‌రాజ్‌లో చేసే దానధర్మాలకు మాములు కంటే కోటిరెట్ల అధిక పుణ్యఫలం ఉంటుంది. ఎందరో చక్రవర్తుల తమ రాజ్యాన్ని, సంపదలను, సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో దానం చేసి మోక్షాన్ని పొందినట్లు చెబుతారు.

పౌరాణిక ప్రాశస్త్యం
త్రేతాయుగంలో వనవాసం సమయంలో శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి ఇక్కడి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది.

చూడాల్సిన ప్రదేశాలు

  • మహా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్లే వారు ప్రయాగ్‌రాజ్‌లోని ఈ ప్రదేశాలను కూడా తప్పకుండా సందర్శించండి.
  • ఎప్పటికి నాశనం కాకుండా కల్పాంతం వరకు నిలిచి ఉండే అక్షయ వట వృక్షం ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంది.
  • శంఖమాధవ, గదామాధవ, చక్రమాధవ అనే 14 మంది మాధవులు విరాజిల్లే ఈ క్షేత్రంలో అందరినీ దర్శించుకోవడం మరవద్దు.
  • అలాగే ప్రయాగ్‌రాజ్‌కి వెళుతున్నట్లయితే తప్పని సరిగా ఆది శంకర విమాన మండపాన్ని సందర్శించండి. ఈ ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు.
  • తంత్ర చూడామణి ప్రకారం ప్రయాగ్‌రాజ్‌ శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి వేలు పడిన ప్రాంతంగా పేరొందిన ఈ శక్తి పీఠంలో అమ్మవారికి లలితాదేవిగా పూజిస్తారు.

కేవలం పేరు పలికినంత మాత్రాన్నే సకల పాపరాశిని ధ్వంసం చేసే ప్రయాగరాజ్​ను మహా కుంభమేళా సందర్భంగా దర్శిద్దాం తరిద్దాం.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details