Hasanamba Temple Story in Telugu :మన దేశంలో ప్రాచీనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, దాదాపు అన్ని దేవాలయాల్లో నిత్యం పూజలు, అర్చనలు జరుగుతుంటాయి. కానీ, ఒక ఆలయాన్ని ఏడాదికోసారి దీపావళికి.. ముందు మాత్రమే తెరుస్తారు. ఆలయం తెరిచి పది లేదా పన్నెండు రోజులు అయ్యాక.. గర్భగుడిలో పూలూ, నేతితో పెట్టిన దీపం, నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత తలుపులు మూస్తారు. మళ్లీ ఏడాది తర్వాత తలుపులు తెరిచేనాటికి కూడా.. ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. ఇలా ఎన్నో మహిమలున్న ఆ ఆలయం ఎక్కడ ఉంది ? టెంపుల్ విశేషాలు ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో హసనాంబాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయజాతర మహోత్సవాలను దీపావళికిముందు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. హాసన నగర అధిదేవతగా హసనాంబాదేవిని భక్తులు పూజిస్తారు. మూడు రాళ్లరూపంలో కొలువైన హసనాంబాదేవి చిరునవ్వులు చిందిస్తూ.. పది లేదా పన్నెండు రోజులపాటు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ సంవత్సరం తొమ్మిది రోజులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి.. సంతోషంగా ఉంటామని భక్తులు విశ్వాసం. ఏటా ఆశ్వయుజ మాసం పూర్ణిమ అనంతరం వచ్చే మొదటి గురువారం హాసనాంబఆలయంతలుపులు తెరుస్తారు. దేవత ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా 'హసన్' అనే పేరు వచ్చిందని భక్తులు భావిస్తారు.
హాసనాంబ ఆలయం తలుపులు తెరిచి ఉత్సవాలు చేసిన తర్వాత చివరిరోజు.. అమ్మవారికి పూలు, నేతి దీపం, ప్రసాదంతో నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక ఆచారాల ప్రకారం ఆలయం మూసివేస్తారు. ఏడాది తర్వాత మళ్లీ తలుపులు తెరిచేనాటికి కూడా.. ఆలయంలో ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. అదే విధంగా పూలు కూడా మొదటిరోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపిస్తాయట. అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవ్వకుండా ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత అని చెబుతారు. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే స్పష్టమైన దాఖలాలు మాత్రం లేవు.
స్థలపురాణం :పురాణాల ప్రకారం.. అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇమ్మంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలుపెడతాడు. ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. ఆ శక్తి బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని నాశనం చేస్తుంది. ఆ తర్వాత సప్తమాత్రికలు కాశీ వెళ్లే ప్రయత్నంలో ఈ హసన్‌కి చేరుకుంటారు. ఈ చోటు నచ్చడంతో మహేశ్వరి, వైష్ణవి, కౌమారి ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోని ఓ కొండలో మమేకం అయితే.. మరో ముగ్గురు దేవతలు దేవగిరి హోండ అనే ప్రాంతంలో ఉండిపోతారు. బ్రాహ్మి మాత్రం కెంచెమ్మన హాస్కోట్ పొలిమేరల్లో ఉందని చెబుతుంటారు. అలా అప్పటినుంచీ ఈ గుడిలో అమ్మవారు మూడు రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోందని చెబుతుంటారు.
నవ్వుతూ ఉంటుంది : అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హసనాంబాదేవిగా పిలుస్తారు. అయితే.. అమ్మ ఇక్కడ వెలసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని సంవత్సరానికి ఒకసారి.. కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పిందట. అందుకే అప్పటినుంచి అదే ఓ ఆచారంలా కొనసాగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ గుడికి సంబంధించి మరో కథ కూడా ఉంది.