Hanuman Birth Story In Telugu :హిందువులు పూజించే దేవుళ్లలో హనుమంతునికి విశేషమైన స్థానం ఉంది. కష్టంలో ఆపద్బాంధవుడిలా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ఆరాధిస్తారు. అయితే హనుమంతుని జననం గురించి శ్రీ రామాయణం, శివపురాణం వంటి గ్రంథాల్లో ఎన్నో కధలు ఉన్నాయి. ఈ కథలను గురించి మనం తెలుసుకుందాం.
కంబ రామాయణ గాథ - పుంజికస్థలకు బృహస్పతి శాపం
ఒకసారి ఇంద్రలోకంలో పుంజికస్థల అనే అప్సరస దేవగురువైన బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు చేయసాగింది. ఎంతో అసందర్భంగా, వికారంగా ఉన్న ఆమె హావభావాలకు బృహస్పతి ఆగ్రహించి పుంజికస్థలను భూలోకంలో వానర కాంతగా జన్మించమని శపించాడట!
శాపానికి ఉపశమనం
బృహస్పతి శాపానికి భయపడిపోయిన పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపానికి ఉపశమనం చెప్పమని బృహస్పతిని పరిపరివిధాలుగా ప్రార్ధించింది. అప్పుడు బృహస్పతి సంతసించి పుంజికస్థల భూలోకంలో హనుమంతునికి జన్మ ఇచ్చిన తర్వాత తిరిగి ఇంద్రలోకానికి రాగలదని శాపానికి ఉపశమనం చెబుతాడు. బృహస్పతి శాపానుసారం పుంజికస్థల భూలోకంలో అంజనాదేవి పేరుతో వానర కాంతగా జన్మిస్తుంది. యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి పెళ్లాడుతుంది.
ఆంజనేయ స్వామి జననం
అంజనాదేవి, కేసరి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారు మంచి సంతానం కోసం ప్రతి నిత్యం భక్తితో శివుని ఆరాధించేవారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనాదేవికి అనుగ్రహిస్తారు. కాలక్రమంలో అంజనాదేవి గర్భవతియై శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయస్వామికి పంపా క్షేత్ర కిష్కింధా నగరాన జన్మనిస్తుంది.