తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

గురుపౌర్ణమి ఎలా జరుపుకోవాలి? గురువుకు పసుపు రంగుకు ఏంటి సంబంధం? - Guru Purnima 2024 - GURU PURNIMA 2024

Guru Purnima Significance : 'గురువు' ఈ ఒక్క పదం మానవాళి మనుగడకు మూలాధారం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆది గురువు వేదవ్యాసుని జన్మ దినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. గురు పూర్ణిమనే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. నాలుగు వేదాలలో, మహాభారతంలో కూడా ఈ వ్యాస పౌర్ణమి ప్రస్తావన ఉంది. జులై20 వ తేదీ గురు పూర్ణిమ సందర్భంగా గురువు అంటే ఏమిటి? గురు పౌర్ణమి ఎలా జరుపుకోవాలి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Guru Purnima
Guru Purnima (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 6:50 PM IST

Updated : Jul 21, 2024, 8:29 AM IST

Guru Purnima Significance : 2024లో గురుపూర్ణిమ జరుపుకునే విషయంలో కొంతగందరగోళం నెలకొంది. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21 సాయంత్రం 3:47 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో గురుపౌర్ణమి జరుపుకునే విషయంలో సందిగ్ధత నెలకొంది. జ్యోతిష్య శాస్త్రవేత్తలు, పంచాంగ కర్తలు పూర్ణిమ తిథి ఏ రోజైతే రాత్రి వేళ ఉంటుందో ఆ రోజున ఉపవాసం, పూజలు, గురు పౌర్ణమి వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. ఆ ప్రకారంగా జూలై 20వ తేదీ గురుపౌర్ణమి వ్రతం ఆచరించి పక్క రోజు అంటే జూలై 21 వ తేదీ దానాలు, నదీ స్నానాలు వంటివి చేయాలని సూచిస్తున్నారు.

గురువు విశిష్టత
'గురు బ్రహ్మ, గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః' చిన్నప్పటి నుంచి మనం ఈ శ్లోకాన్ని నేర్చుకుంటూ పెరిగాం. మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీట వేసింది. మాతృదేవోభవ! పితృదేవో భవ! ఆచార్య దేవోభవ! అని అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే! గురువుకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే అవతార పురుషులైన శ్రీరాముడు వశిష్టుని వద్ద, శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద, పాండవులు ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించారు. ఆది గురువైన వ్యాసుని జన్మ దినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం.

ఎవరీ వ్యాసుడు?
ద్వాపర యుగంలో పరాశరుడు సత్యవతికి జన్మించిన వాడే వ్యాసుడు. 'వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే! నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః' అని విష్ణు సహస్రనామాలో చదువుకుంటాం కదా! అంటే వ్యాసుడే విష్ణువు... విష్ణువే వ్యాసుడని అర్థం. అందుకే ఆయన జన్మదినం మనం ఒక పండుగలా వేడుకగా చేసుకుంటాం.

గురు పౌర్ణమి పూజావిధానం

  • గురు పూర్ణిమ రోజున, ఉదయాన్నే స్నానం చేసి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై లక్ష్మీనారాయణులు విగ్రహాలను కానీ చిత్ర పటాలను కానీ ఉంచుకోవాలి.
  • అనంతరం ఎవరినైతే మనం కుల గురువుగా భావించి పూజిస్తూ ఉంటామో ఆ విగ్రహాన్ని కూడా పీటపై ఉంచుకోవాలి.
  • భక్తిశ్రద్దలతో లక్ష్మీనారాయణుల అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. తరువాత గురు పరంపరను, గురు శ్లోకాలను భక్తితో పఠించాలి.
  • పసుపు రంగు గురువుకు సంకేతం కాబట్టి పూజలో వీలైనంత వరకు పసుపు రంగు పూలు, పండ్లు, ప్రసాదాలు సమర్పించాలి.
  • ఈ రోజు శ్రీమన్నారాయణుని స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విశేషంగా ఆచరిస్తారు. సాయంత్రం సమీపంలోని గురువు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.
  • గురుపౌర్ణమి రోజు అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజు వైష్ణవ పురాణం దానం చేస్తే శాశ్వత విష్ణులోకం పొందుతారని సాక్షాత్తూ ఆ శ్రీ మహా విష్ణువే వరం ఇచ్చాడంట.

వ్యాసుడు సకలకళా వల్లభుడు
వేదవ్యాసుడు మహానుభావుడు. సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి అంతే కాదు అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వ్యాసుని ఈ రోజు తప్పకుండా స్మరించుకోవాలి.

దేవాలయాల్లో పూజలు
ఈ రోజు గురుపౌర్ణమి సందర్భంగా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా వారి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మనం కూడా గురుపౌర్ణమి సందర్భంగా మన ప్రత్యక్ష గురువులకు , పరోక్ష గురువులకు నమస్కరించుకోవాలి.

చివరి మాట
గురువులకు స్వార్థం ఉండదు. శిష్యుల భవిష్యత్​కు బంగారు బాటలు వేయడంలోనే గురువుకు సంతోషం ఉంటుంది. కానీ నేటి రోజుల్లో సామాజిక మాధ్యమాలలో, సినిమాలలో గురువులను కించపరిచే విధంగా చూపించడం సబబు కాదు. గురువు లేని జన్మ గుడ్డి జన్మ వంటిదని శాస్త్రం చెబుతోంది. అలాగే గురువులు కూడా సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. శిష్యుల శ్రేయస్సే ముఖ్యంగా పని చేయాలి.

నిత్య గురు వందనం
జ్ఞానప్రదాత అయిన గురువును ఏదో సంవత్సరానికి ఒక్కసారి గురుపూర్ణిమ రోజున మొక్కుబడిగా పూజించి చేతులు దులిపేసుకోవడం కాదు! గురువులు చెప్పిన మార్గంలో నడవడం, ధర్మ బద్దమైన జీవితాన్ని గడుపుతూ మనకు మార్గదర్శిగా నిలిచిన గురువుకు మంచి పేరు వచ్చేలా నడుచుకోవడమే నిజమైన గురుపూజ. అదే నిజమైన గురువందనం! అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Last Updated : Jul 21, 2024, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details