Ganesh Pooja 21 Leaves Significance : భారతీయ సంస్కృతి ప్రకారం హిందువులు పండుగలు ఆయా కాలానికి అనుగుణంగా జరుపుకునే సంప్రదాయం పూర్వకాలం నుంచి వస్తుంది. పండుగల సందర్భంగా దేవునికి నైవేద్యాలను సమర్పించడం వెనుక కూడా ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. ఆయా సీజన్లో ఆరోగ్యపరంగా పాటించాల్సిన నియమాల ప్రకారమే దేవునికి నివేదించే నైవేద్యాలు కూడా తయారు చేసేవారు. అందుకనే హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో సైన్స్ దాగి ఉంది అని చెప్పవచ్చు.
వినాయకుని పత్రి పూజలో శాస్త్రీయత
వినాయక చవితి సందర్భంగా గణనాధుని 21 రకాల పత్రితో పూజించడం వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. వినాయకుని పూజలో వాడే పత్రి రకాలు ఏమిటి? వాటిలో ఔషధ గుణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- మాచీ పత్రం:
వినాయకుని పూజలో వాడే మాచీపత్రం సువాసనలు వెదజల్లుతుంది. ఈ మాచిపత్రాన్ని వాసన చూస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. - దూర్వార పత్రం (గరిక):
వినాయకుని పూజకు గరిక అత్యంత శ్రేష్టం. దీనినే దూర్వార పత్రం అని కూడా అంటారు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు గరికలో ఉన్నాయి. - అపామార్గ పత్రం (ఉత్తరేణి):
వినాయకుని పూజలో వాడే అపామార్గ పత్రం లేదా ఉత్తరేణి ఆకులు దగ్గు, ఆస్తమా సమస్యలను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. - బృహతీ పత్రం (ములక):
వినాయకుని పూజలో వాడే బృహతీ పత్రం లేదా ములక ఆకు శ్వాస కోశ సమస్యలను నయం చేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్న వారికి ఈ ఆకును వాడితే ప్రయోజనం ఉంటుంది. - దత్తూర పత్రం (ఉమ్మెత్త) :
వినాయకుని పూజలో వాడే దత్తూర పత్రాన్ని ఉమ్మెత్త అని కూడా అంటారు. ఉమ్మెత్త శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని తగ్గిస్తుంది. - తులసీ పత్రం( తులసి):
వినాయకుని పూజలో వాడే తులసి పత్రం గురించి అందరికీ తెలిసిందే! దాదాపుగా ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గించి చల్లబరచడానికి తులసి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే శ్వాస కోశ సమస్యలకు కూడా తులసి తగ్గిస్తుంది. - బిల్వ పత్రం (మారేడు):
వినాయకుని పూజలో వాడే బిల్వ పత్రం గురించి తెలియని వారుండరు. షుగర్ వ్యాధి ఉన్నవారికి మారేడు మంచి ఔషధం. అలాగే మారేడు దళాలను నమిలితే విరేచనాలు కూడా తగ్గుతాయి. - బదరీ పత్రం (రేగు):
వినాయకుని పూజలో వాడే బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకు చర్మ సమస్యలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. - చూత పత్రం (మామిడి):
వినాయకుని పూజలో వాడే చూత పత్రం అంటే మామిడి ఆకు నమిలితే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు సమస్యలు మటుమాయం అవుతాయి. అలాగే మామిడి పుల్లలతో దంతాలను తోముకుంటే నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. - కరవీర పత్రం (గన్నేరు):
వినాయకుని పూజలో వాడే కరవీర పత్రం అంటే గన్నేరు పత్రాన్ని చూర్ణంగా చేసి శరీరంపై ఉన్న గడ్డలు, గాయాలపై పూతగా రాస్తే మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే ఈ మొక్క వేరు, బెరడు కూడా మంచి ఔషధం. - మరువక పత్రం (ధవనం, మరువం):
వినాయకుని పూజలో వాడే మరువక పత్రం ఆకులు మంచి సువాసనను వెదజల్లుతాయి. వీటి వాసన చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గుతుంది. - శమీ పత్రం (జమ్మి):
వినాయకుని పూజలో వాడే శమీ పత్రం అంటే జమ్మి ఆకులు నోటి సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. - విష్ణుక్రాంత పత్రం:
వినాయకుని పూజలో వాడే విష్ణుక్రాంత పత్రం సౌందర్య సాధనంగా పని చేస్తుంది. ఈ ఆకులతో చర్మ సౌందర్యం పెరుగుతుంది. - సింధువార పత్రం (వావిలాకు):
వినాయకుని పూజలో వాడే సింధువార పత్రం అంటే వావిలాకు కీళ్ల నొప్పుల సమస్యను తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. కీళ్లనొప్పులు ఉన్నవారు ఈ ఆకును చూర్ణం చేసి నొప్పి ఉన్న చోట వాడితే నొప్పులు తగ్గుముఖం పడతాయి. - అశ్వత్థ పత్రం (రావి):
వినాయకుని పూజలో వాడే అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఆకులు చర్మ సమస్యలు వారికి మంచి ఔషధం. ఈ ఆకుల చూర్ణాన్ని వాడితే ఎలాంటి చర్మ సమస్యలైనా తగ్గుముఖం పడతాయి. - దాడిమీ పత్రం (దానిమ్మ):
వినాయకుని పూజలో వాడే దాడిమీ పత్రం (దానిమ్మ చెట్టు) ఆకులు వాంతులు, విరేచనాలను అరికడతాయి. - జాజి పత్రం (జాజిమల్లి):
వినాయకుని పూజలో వాడే జాజి పత్రం అంటే సన్నజాజి ఆకులు చర్మ సమస్యలు, స్త్రీ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. - అర్జున పత్రం (మద్ది):
వినాయకుని పూజలో వాడే అర్జున పత్రం అంటే మద్ది ఆకులు గుండె సమస్యలను దూరం చేస్తాయి. గుండె ఆరోగ్యానికి, రక్తం సరఫరా అయ్యేందుకు ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. - దేవదారు పత్రం:
వినాయకుని పూజలో వాడే దేవదారు పత్రం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఈ ఆకు ఆక్సిజన్ ఎక్కువగా సరఫరా చేస్తుంది కాబట్టి దీని వాసన చూస్తే ఒత్తిడి తగ్గుతుంది. - గండలీ పత్రం (లతాదూర్వా):
వినాయకుని పూజలో వాడే గండలీ పత్రం అంటే లతాదూర్వా పత్రాలు అతిమూత్ర సమస్యను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. - అర్క పత్రం (జిల్లేడు):
వినాయకుని పూజలో వాడే అర్క పత్రం అంటే జిల్లేడు ఆకు నరాల బలహీనత, చర్మ సమస్యలు తగ్గిస్తాయి.