Shivarpanam Story In Telugu :ఇది నిజంగా జరిగిన కథ అని చెబుతారు. ఇప్పటికీ ఆ ప్రదేశంలో జరిగే ఉత్సవాలు, వేడుకలు ఇందుకు నిదర్శనం. పరమ శివునికి మహాభక్తుడైన ఓ జాలరి కథను తెలుసుకుందాం.
జాలరి కథ
తమిళనాడు దగ్గర సముద్రతీర ప్రాంతంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహా శివభక్తుడు. ఈ జాలరివాడి దినచర్య అందరిలా కాకుండా కొంత ప్రత్యేకంగా ఉండేది. ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు. ఈ జాలరి అందరితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు. అయితే ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు. ఈ విధంగా అతను భగవద్భక్తిని పాటిస్తూ కుటుంబ పోషణ చేస్తూ జీవనాన్ని సాగిస్తుండేవాడు. ఇతని బ్రతుకులో తెలిసినదంతా తనకు దొరికిన దానిలో మొదటిది శివార్పణం చేయడమే!
శివార్పణం అంటే!
నిజానికి భక్తి అంటేనే శివార్పణం. ఏ పని చేసినా భక్తితో మనసారా శివార్పణం అంటే చాలు ఎక్కడలేని ప్రశాంతత కలుగుతుంది. అలా అనగలిగిన వారు నిజంగా ధన్యులు. నిజానికి శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. శివభక్తి, శివ ప్రేమ, శివార్పణం ఇలాంటి మాటలు. ఈ జాలరికి తెలిసిన ఒకే పదం శివార్పణం.
ఒకే మాటగా ఒకే బాటగా!
ఈ జాలరి నాయకత్వంతో అందరూ సుఖంగా ఉండేవాళ్లు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్లు అదే పాటించేవారు. ఒకే మాటగా ఒకే బాటగా వారంతా ఆనందంగా జీవనం సాగిస్తుండేవాడు. జాలరి నాయకత్వంలో మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు.
ముంచుకొచ్చిన ఆపద
ఇలా కాలం ఆనందంగా సాగుతుండగా ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్లకి చేపలు పడలేదు. ఎన్నాళ్లు సముద్రంలోకి ఎంత దూరం వెళ్లి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకీ, కుటుంబ పోషణకీ అయిపోయాయి. చివరికి తిండికి కూడా కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఎవరి ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు.
వలలో బంగారు చేప
ఒకసారి అందరూ గుంపుగా వెళ్లి చేపల కోసం వల వేశారు. జాలరి నాయకుడు వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు పొదిగిన చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది. దానిని వీళ్లందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు. ఈ చేపని కానీ తీసుకువెళ్లి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్లకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్మినా మరెన్నడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది.
మరి శివార్పణం ఎలా!
జాలరి నాయకునికి మొదట పడ్డ చేప శివార్పణంగా సముద్రంలోకి విసిరేయడం అలవాటు కదా! పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప.
ఆందోళనలో జాలరులు
అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న మిగిలిన వాళ్లందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్లందరికీ తెలుసు. మొదటి చేపను శివార్పణం అని వేయడం ఈయనకు అలవాటు. నాయకుడు కాబట్టి వద్దు అనలేరు. తిండికి కూడా గడవని ఈ గడ్డు పరిస్థితిలో ఈయన ఇప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన కలిగింది. మిగిలిన జాలరులు ప్రతిరోజూ తిండికి లేదని బాధ పడుతుంటే ఈ పెద్దమనిషి మాత్రం రోజూ శివార్పణం చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు. ఇక ఇప్పుడు ఈ బంగారు చేపను శివార్పణం చేస్తే ఇక మన గతి ఏంటి అని అందరూ ఆందోళన చెందసాగారు.
అదీ భక్తి అంటే
ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్లంతా పులకించిపోయింది. కళ్లవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి. ఆ చేపని పైకి తీశాడు. మిగిలిన జాలరులు ఆ చేపను శివార్పణం చేయవద్దని ఆయన కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు.