Dwaraka Tirumala Temple History : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారికి మరో విడిది ఎక్కడ ఉందో తెలుసా? తిరుమలకు వెళ్లలేని వారు ఇక్కడ వెంకన్న మొక్కులు తీర్చుకోవచ్చు. స్వయంభువుగా శ్రీనివాసుడు వెలసిన ఈ మహిమాన్విత క్షేత్రం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
'ఏడేడు శిఖరాలు నే నడువలేను వెంకన్న పాదాలు దర్శించలేను' అని బాధపడే వారికి కోసం శ్రీనివాసుడు స్వయంభువుగా మనకు అతి సమీపంలోనే వెలిసాడు.
చిన్న తిరుపతి
ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు "ద్వారకా తిరుమల"లో కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసినందున ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు. అలాగే ఏ కారణం చేతనైనా తిరుమల వెళ్ళి మొక్కులు చెల్లించుకోలేని వారు ద్వారకా తిరుమలలో మొక్కులు చెల్లించుకోవచ్చు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ద్వారకా తిరుమల క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం.
ద్వారకుని తపస్సు - దక్షిణముఖంగా వెలసిన స్వామి
ఆలయ స్థల పురాణం ప్రకారం ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామి వారి పాద సేవను కోరారట. దాంతో స్వామి వారి పాదాలు మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామి వారిపై భాగం మాత్రమే దర్శనమిస్తుంది. ద్వారకుడు ఉత్తరాభి ముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభి ముఖుడై ఉన్నాడట. అందుకనే ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణ ముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామి వారిపై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థ విగ్రహం ఉంటుంది.
రామానుజాచార్య ప్రతిష్టిత ధృవ మూర్తి
విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి భక్తులందరి విన్నపాలను స్వీకరించి, స్వామికి పాద పూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవ మూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖానస ఆగమ ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.
మోక్షం కోసం ఒకటి- పురుషార్ధాలు కోసం మరోటి
స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, ఆ తరువాత ప్రతిష్టించిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్ధములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం.
ఆలయ స్థల పురాణం
బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజ మహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ, స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు.
తాను మార్గమధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీ వేంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్రగల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు.
అభిషేకాలు లేని స్వామి
ఈ ఆలయంలో స్వామికి అభిషేకాలు జరపరు. ఎందుకంటే, స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి వారి విగ్రహం క్రింద ఉండే ఎర్ర చీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు.