తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

'ధనత్రయోదశి' ఎప్పుడు జరుపుకోవాలి? ఆ రోజు కచ్చితంగా బంగారం, వెండి కొనాలా?

ధనత్రయోదశి ఏ రోజు జరుపుకోవాలి? శుభ ముహూర్తం, పూజా విధానం వివరాలు మీ కోసం!

Dhantrayodashi 2024
Dhantrayodashi 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Dhantrayodashi 2024: అందరి జీవితాలలో వెలుగులు నింపే ఈ దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమయ్యే దీపావళి వేడుకలు కార్తీక శుద్ద విదియ 'భగినీహస్త భోజనం'తో ముగుస్తాయి. ఈ సందర్భంగా ధన త్రయోదశి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధన త్రయోదశి
దీపావళి ఐదు రోజుల సంబరాలలో మొదటి రోజు అయిన ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన్​​తేరాస్ లేదా ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. ఈ రోజున కొత్త వెండి, బంగారు ఆభరణాలు కొని వాటిని లక్ష్మీదేవి పూజలో పెడితే ఆ ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజు తనను పూజించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కాకుండా ఏ వస్తువు కొనుగోలు చేసిన శుభం జరుగుతుందని విశ్వాసం.

ధనత్రయోదశి ఎప్పుడు?
ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి అక్టోబర్ 29న మంగళవారం ఉదయం 10:33 గంటలకు మొదలై అక్టోబర్ 30వ తేదీ 12:35 గంటలకు ముగుస్తోంది. సాధారణంగా ధనలక్ష్మీ పూజ సాయంత్రం చేస్తారు. అందుకే త్రయోదశి తిధి సాయంత్రం సమయంలో ఉన్న అక్టోబరు 29వ తేదీనే ధన త్రయోదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు, జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు.

ధన్‌తేరస్ పూజ శుభ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకు ధన్‌తేరస్ పూజకు శుభసమయం.

ధన్‌తేరస్ పూజావిధానం
ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి, కుబేరుల విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ గంధం కుంకుమలతో అలంకరించి, ఆవు నేతితో దీపారాధన చేయాలి. సన్నజాజులు, కలువ పూలతో లక్ష్మీ దేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. సువాసనలు వెదజల్లే పన్నీరు, గంధ పుష్పాక్షతలను అమ్మవారికి సమర్పించాలి. ఆవు పాలు, పంచదార ఏలకులు, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. శక్తి ఉన్నవారు బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేసి పూజలో ఉంచుకోవచ్చు. అనంతరం శ్రీ లక్ష్మీదేవికి కర్పూర నీరాజనాలు ఇవ్వాలి.

బంగారం, వెండి కొనాలా?
ధన్‌తేరస్‌ రోజున బంగారు, వెండి ఆభరణాలు, పాత్రలు, ఇత్తడి, చీపుర్లు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.

ఇది కూడా గుర్తుంచుకోవాలి!
ధన్‌తేరస్‌ రోజు ఏమి కొనాలా అని ఆలోచించే వారు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. బంగారు వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ఆర్థిక స్తోమత ఉండాలి. చాలా మంది కొంటున్నారు కదా అని పోటీపడి అప్పులు చేసైనా బంగారం కొంటే అప్పులు వృద్ధి చెందుతాయి కానీ, సిరి సంపదలు వృద్ధి చెందవన్న సత్యాన్ని గ్రహించాలి.

ఆడంబరం కాదు భక్తే ప్రధానం
శ్రీ మహాలక్ష్మి ధాన్య రాశులలో, పువ్వులలో, పసిపాపల నవ్వుల్లో, ఉప్పు జీలకర్ర వంటి వంట సామగ్రిలో కూడా ఉంటుంది. ధన్‌తేరస్‌ రోజున లక్ష్మీదేవి స్థిరనివాసంగా భావించే ఎదో ఒక వస్తువును మన శక్తికొద్దీ కొనుగోలు చేస్తే సరిపోతుంది. అన్నింటికన్నా లక్ష్మీదేవి పూజలో ఆడంబరం కన్నా భక్తి ప్రధానం. ఈ ధన్‌తేరస్​ను మన శక్తికొద్దీ భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం సిరులతల్లి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details