Subrahmanya Sashti 2024 : ఒక చేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రానున్న సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు? పూజా విధానం ఏమిటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు?
మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 నిమిషాల వరకు కొనసాగుతుంది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి. అందకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం.
కుజ గ్రహాధిపతి
వ్యాస మహర్హి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజ గ్రహానికి అధిపతిగా చెబుతారు. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాలలో స్వామి వారికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అంతే కాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్ర రోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని, పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతంలో ఎక్కువగా చూస్తుంటాం.
సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాదికాలు పూర్తి చేసుకోవాలి. పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామికి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి.