తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కళ్యాణ, సంతాన ప్రాప్తి కలిగించే అట్లతద్ది - పూజ విధానం, విశిష్టతలివే!

కన్నెపిల్లలు జరుపుకునే పండుగ- కళ్యాణ, సంతాన ప్రాప్తి కలిగించే అట్లతద్ది

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Atla Tadde 2024
Atla Tadde 2024 (Getty Images)

Atla Tadde 2024 :హిందూ సాంప్రదాయాల ప్రకారం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఓ అంతరార్ధం ఉంటుంది. మానవ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు పరిష్కారం చూపించే వ్రతాలు నోములు మన సంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు మంచి భర్తను పొందటానికి, సంతాన ప్రాప్తిని పొందటానికి ప్రత్యేకించిన పండుగ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

అచ్చ తెలుగు పండగ అట్ల తద్ది పండుగ
అట్లతద్ది పండుగ రోజు పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు ఒక చోటకు చేరి చేతులకు గోరింటాకు పెట్టుకుని, తాంబూలం వేసుకుని చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. మన తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టే ఈ అట్లతద్ది పండగ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విశేషాలు తెలుసుకుందాం.

అట్లతద్ది ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ తదియ రోజు అట్లతద్ది పండుగ జరుపుకుంటాం. ఈ ఏడాది అక్టోబరు 20న ఆశ్వయుజ బహుళ తదియ సూర్యోదయంతో ఉంది. అందుకే ఆ రోజున అట్లతద్ది పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. "అట్లతద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఒకరికొకరు వాయనాలిచ్చి పుచ్చుకునే పండుగ ఇది.

అట్లతద్ది ఎవరు జరుపుకుంటారు
కన్నెపిల్లలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో అట్లతద్ది ఒకటి. ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు జరుపుకునే ఈ పండుగ ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు చేసుకుంటారు.

అట్లతద్ది విశిష్టత
అవివాహిత యువతులు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు, అతడు ఆరోగ్యంగా ఉండాలని, సత్సంతానం కలగాలని కోరుకుంటూ అట్లతద్ది వ్రతాన్ని ఆచరిస్తారు. ఒకసారి ఈ పూజ మొదలు పెట్టి వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, పది సంవత్సరాల తర్వాత ఉద్యాపన చేస్తారు. అంటే చివరి సారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయనాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.

అట్లతద్ది వెనుక ఉన్న పురాణగాథ
అట్ల తద్ది వెనుక ఉన్న పురాణం విశేషమేమిటంటే త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది పండుగ అని, స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం అట్లతద్ది వ్రతం అని నారద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.

కుజదోషాన్ని పోగొట్టే అట్లతద్ది
జాతకం ప్రకారం కుజ దోషం ఉంటే వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగక పోవడం, గర్భదోషాలు వంటివి ఏర్పడతాయి. అట్లతద్ది వ్రతం చేసుకోవడం వలన కుజ దోషం తొలుగుతుంది. అట్లతద్ది పండగలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవ గ్రహాలలో కుజుడుకీ అట్లంటే మహాప్రీతి. అట్లను నైవేద్యంగా పెడితే కుజ దోషం పరిహారమై సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. అంతేకాదు కుజుడు రజోదయానికి కారకుడు. రుతు చక్రం సక్రమంగా ఉంచి రుతు సమస్యలు రాకుండా కాపాడుతాడు. దీంతో గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రవచనం.

చంద్రారాధన ప్రధానమైన పూజ
అట్లతద్ది ముఖ్యంగా చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్న శక్తి గౌరీ దేవి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

అట్ల తద్ది పూజా విధానం
అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి. ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ముందుగా ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్ర దర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. అనంతరం ముత్తైదువులను సుమంగళి ద్రవ్యాలతో అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకుని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తామూ భోజనం చేయాలి.

పది సంఖ్యకు ప్రాధాన్యం
అట్లతద్ది పండుగలో పది సంఖ్యకు ఎంతో ప్రాధాన్యముంది. పది రకాల పండ్లను తినడం పదిమార్లు తాంబూలం వేసుకోవడం. పదిసార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం ఈ పండగలో విశేషం. దీన్నే ఊయ్యల పండగ అని, గోరింటాకు పండగ అని కూడా అంటారు. ఈ పండుగ వల్ల గౌరీ దేవి అనుగ్రహం లభించి అవివాహిత యువతులకు గుణవంతుడు, అందగాడైన వ్యక్తిని భర్తగా లభిస్తాడని, పెళ్లైన వారికి సంతానం కలుగుతుందని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

ఇంతటి విశిష్టమైన అట్లతద్ది పండుగ పెళ్లి కావలసిన కన్యలు తప్పకుండా ఆచరించి ఆ గౌరీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details