CM Revanth Reddy On Group 1 Candidates : గ్రూప్ వన్ విషయంలో అపోహలు నమ్మవద్దని పదేళ్లలో కనీసం పట్టించుకోని వారి ఉచ్చులో పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటున్నాయని వారు ఎలాంటి దుర్మార్గులో ఒకసారి నెమరువేసుకోవాలని సీఎం సూచించారు. గతంలో అభ్యర్థులు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవారని, వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్థించాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దయచేసి ఆందోళన విరమించి మెయిన్ పరీక్షకు హాజరుకావాలని లేదంటే బంగారు అవకాశాన్ని కోల్పోతారని సూచించారు.
అభ్యర్థులపై లాఠీచార్జి చేయవద్దు : పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వని వారు ఇవాళ దగ్గరకు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీవో 55ప్రకారం భర్తీ చేస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోతారని అందుకే జీవో 29తీసుకువచ్చినట్లు వివరించారు. పోలీసు డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వంలో ఏనాడైనా విద్యార్థులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అభ్యర్థులపై లాఠీచార్జీ చేయవద్దని కేసులు పెట్టవద్దని పోలీసులకు సూచిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర సాధనలో పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగం మరువలేనిదన్నారు.
మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌ను అరికట్టాలి : రాష్ట్ర ప్రభుత్వ గౌరవం పోలీసులపై ఉంటుందని వెల్లడించారు. పోలీసు శాఖలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌ను అరికట్టాలని తెలిపారు. సైబర్ క్రైమ్‌ను నియంత్రించడంలో దేశంలోనే ఉత్తమ అవార్డ్ రావడం సంతోషమని సీఎం పేర్కొన్నారు.సైబర్ క్రైమ్,డ్రగ్స్ ను నియంత్రణ చేసేందుకు ప్రకటనలు ఇచ్చే సినిమాలకే టికెట్ ధర పెంపు,ఇతర రాయితీలు ఇస్తున్నామని వివరించారు.
"తరచూ పరీక్షల వాయిదాల వల్ల విద్యార్థులు నష్టపోతారు. గతంలో అభ్యర్థులు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగారు. వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఏళ్ల తరబడి పరీక్షలకు సిద్ధమవుతుంటే తల్లిదండ్రులు బాధపడతారు. ఎవరూ బాధపడొద్దనే వేగంగా నియామకాల భర్తీ చేస్తున్నాం. కొందరి మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. నోటిఫికేషన్ ఇచ్చాక నిబంధనలు మారిస్తే కోర్టులు కొట్టివేస్తాయి. జోవో 55 ప్రకారం పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగేది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 ఎంపికలో కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాం"-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
సుందరీకరణ కాదు - మూసీ నది పునరుజ్జీవం : సీఎం రేవంత్
కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉంది : సీఎం రేవంత్ రెడ్డి