తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించే 'గోవత్స ద్వాదశి' - పూజ ఎలా చేయాలో తెలుసా?

గోవత్స ద్వాదశి గురించి తెలుసా? ఎవరిని పూజించాలి? ఎలాంటి పాటించాల్సిన నియమాల వివరాలు

Govatsa Dwadashi 2024
Govatsa Dwadashi 2024 (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Govatsa Dwadashi 2024 :హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి, ద్వాదశి తిథులు పరమ పవిత్రమైనవి. అలాగే గోపూజకు హిందూ సంప్రదాయం పెద్ద పీట వేస్తుంది. ఈ సందర్భంగా ద్వాదశి, గోపూజ రెండింటి విశిష్టతను తెలిపే ఓ పర్వదినం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

గోవత్స ద్వాదశి విశిష్టత
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆశ్వయుజ బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశిగా జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం దీపావళికి రెండు రోజుల ముందుగా వచ్చే ఈ గోవత్స ద్వాదశి రోజు గోమాతను పూజించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం.

సకల దేవతల నిలయం గోమాత
గోవత్స ద్వాదశి పూజా విధానం తెలుసుకునే ముందు గోమాతను గురించి తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆవు పృష్ణ అంటే తోక వెనుక భాగంలో శ్రీ మహాలక్ష్మీ దేవి కొలువై ఉంటుందని అంటారు. అందుకే గోమాత వెనుక భాగంలో పసుపు కుంకుమలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని అంటారు. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి, ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, నాలుకపై వరుణ దేవుడు, ఆవు సంకరంలో సరస్వతీదేవి, ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమ వైపున ధర్మదేవతలు, ఆవు కంఠంలో ఇంద్రుడు, ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు, ఆవు గిట్టల చివర నాగ దేవతలు, గిట్టల పక్కన అప్సరసలు ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకే గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

గోవత్స ద్వాదశి ఎప్పుడు
అక్టోబర్ 29వ తేదీ మంగళవారం సూర్యోదయంతో ద్వాదశి తిథి ఉంది. ఆ రోజునే గోవత్స ద్వాదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు గోపూజ చేయడానికి శుభసమయం.

గోవత్స ద్వాదశి పూజా విధానం
గోవత్స ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముంగిలి ఆవు పేడతో అలికి ముగ్గులు వేయాలి. అనంతరం ఆవు దూడతో కలిసి ఉన్న చిన్ని కృష్ణుని పూజించాలి. తరువాత సమీపంలోని గోశాలకు వెళ్లి దూడతో కూడిన గోవును పూజించాలి. గో పూజలో భాగంగా ఆవు, దూడను పసుపు, కుంకుమతో అలంకరించి రాగి పాత్రతో గోవు పాదాలకు ఆర్యమియ్యాలి. ఈ రోజు విశేషంగా గారెలు, బూరెలు నైవేద్యంగా తయారుచేసి గోమాతకు తినిపించాలి.

ఆ తర్వాత"సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే | మాతర్మమాభిలషితం సఫలం కురు నందిని"||అనే మంత్రాన్ని జపిస్తూ గోమాతను ప్రార్ధించాలి. గోవత్స ద్వాదశి రోజు దూడతో కూడిన గోమాతను పూజించిన వారికి సకల సంపదలు కలిగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి.

గో పూజకు నియమాలు
ఏ పూజకైనా సత్వర ఫలితం రావాలంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. గోవత్స ద్వాదశి రోజు దూడతో కూడిన గోమాతను పూజించే వారు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చేయాలి. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని అంటారు. అంతేకాకుండా ఈ రోజు గోమాతను దానం చేస్తే కోటి పుణ్య ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గోమాతను దానం చేయడం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఆవు పాలు ఎంతో శ్రేయస్కరం. ఆవు పాలను చంటి పిల్లలు ఉన్న తల్లులకు దానం చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అంటారు.

రానున్న గోవత్స ద్వాదశి రోజు మనం కూడా గోమాతను పూజిద్దాం అష్టైశ్వర్యాలు పొందుదాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్తు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details