CM Revanth Reddy Security Changes : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా వ్యవహారాలు చూసుకునే సీఎం సెక్యూరిటీ వింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతలో ఈ మార్పులు జరిగాయి. ఇప్పటివరకు సీఎం ఇంటి వద్ద బెటాలియన్ పోలీస్ సిబ్బంది భద్రతను చూసుకునేవారు. ముఖ్యమంత్రి ఇంటి వద్దకు వచ్చే వారి తనిఖీలు, భద్రత అన్నీ వీరే చూసుకునేవారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా సీఎం సెక్యూరిటీ వింగ్ వారిని తొలగించింది. వారి స్థానంలో ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి ఆ బాధ్యత అప్పగించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఇంటికి మూడు వైపులా 22 మంది టీజీఎస్పీ సిబ్బంది ఉండేవారు. ఇక నుంచి వారి స్థానాల్లో ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
పోలీసుల ఆందోళనల నేపథ్యంలో మార్పులు : ప్రస్తుతం రాష్ట్రంలో బెటాలియన్ పోలీసుల ఆందోళన జరుగుతోంది. 'ఒకే పోలీస్ - ఒకే రాష్ట్రం' పేరుతో గత 5 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు సాధారణ పోలీసుల తరహాలో డ్యూటీలు వేయాలని, సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరనసలు చేపట్టారు. సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని డీజీపీ జితేందర్ ప్రకటించినా వారు ఆందోళనలు విరమించలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మరో 39 మందిని సస్పెండ్ చేశారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు సీఎం సెక్యూరిటీ వింగ్ అక్కడ ఉన్న టీజీఎస్పీ సిబ్బందిని తొలగించి ఆ డ్యూటీ ఆర్మడ్ రిజర్వ్ సిబ్బందికి అప్పగించారు. మరోవైపు సచివాలయం వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేయరాదని, లైక్ చేయడం, ఫార్వర్డ్ చేయడం కూడా వద్దని సెక్రటేరియెట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సిబ్బందికి సూచించారు.
'మీ సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంది - పోస్టులు పెట్టకండి, లైక్ చేయకండి!'
'వారిని విధుల్లోకి తీసుకోండి.. లేదంటే మమ్మల్ని సస్పెండ్ చేయండి' - ఆగని ఖాకీల ఆందోళనలు