Mumbai Indians Retained Players 2025 : 2025 ముంబయి ఇండియన్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్ల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని ఫ్రాంచైజీలు అక్టోబర్ 31 సాయంత్రం వరకు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను బోర్డుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ముంబయి ఫ్రాంచైజీ ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుందో అంచనా వేశాడు. ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రిటెన్షన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఈ ముగ్గురు ప్లేయర్లు రిటెన్షన్ లిస్ట్‌లో ఉండడం పక్కా అని హర్భజన్ భావించాడు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ముంబయి అట్టిపెట్టుకుంటుందా? లేదా అనేది ఆసక్తిగా ఉందన్నాడు.
'గత మూడు సీజన్లలో ముంబయి ఇండియన్స్ సరిగ్గా ఆడలేదు. కానీ, అది ఒక ఛాంపియన్ టీమ్. చాలా బలమైన జట్టు. నాకు తెలిసినంతవరకు వారు కచ్చితంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని జట్టును నిర్మించాలని ఆలోచిస్తారు. అయితే, ఈ సంవత్సరం అనుభవజ్ఞులైన ఆటగాళ్లను తీసుకోదని భావించలేం. గతేడాది హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించారు. దీంతో అతడిని రిటైన్ చేసుకుంటారని భావిస్తున్నాను. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగిస్తారు. రోహిత్ శర్మను రిటైన్ చేస్తారా? లేదా అనే ప్రశ్న మిగిలి ఉంది'
'రోహిత్ కెప్టెన్‌గా ఇటీవల టీ20 వరల్డ్‌కప్ సాధించాడు. కాబట్టి అతడిని కొనసాగిస్తారనే అనుకుంటున్నా. దీంతో రిటైన్ చేసుకున్న ప్లేయర్ల సంఖ్య నాలుగుకి చేరుతుంది. ఐదో ప్లేయర్ కావాలనుకుంటే మాత్రం తిలక్ వర్మను తీసుకోవచ్చు. ఫ్యూచర్లో ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌లు గెలవడానికి ఉపయోగపడే ఆటగాళ్లలో తిలక్ వర్మ ఒకరు. బౌలింగ్‌లో వారు రిటైన్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి ఎవరూ లేరు. దీంతో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నేహాల్ వధేరా వారికి మంచి ఆప్షన్' అని హర్భజన్ పేర్కొన్నాడు. కాగా నవంబర్ చివరి లేదా డిసెంబర్ తొలి వారంలో మెగా వేలం జరగనుంది.
ముంబయి ఇండియన్స్ రిటెన్షన్స్ 2025 (అంచనా*)
- సూర్యకుమార్ యాదవ్
- తిలక్ వర్మ
- జస్ప్రీత్ బుమ్రా
- హార్దిక్ పాండ్య
- రోహిత్ శర్మ
క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్- IPL రిటెన్షన్స్ లైవ్ స్ట్రీమింగ్- డీటెయిల్స్ ఇవే!