Chollangi Amavasya In 2025 Date :గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో ఉన్న చిన్న గ్రామమే చొల్లంగి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ గ్రామం వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ సంగమ ప్రదేశానికి చొల్లంగి అని పేరు. చొల్లంగి అమావాస్య రోజు ఈ సంగమ ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చింది. చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు.
చొల్లంగి అమావాస్య విశిష్టత
పుష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని అంటారు. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగ ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజు గంగా నదిలో స్నానం పుణ్యమని భావిస్తారు. అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది చొల్లంగి అమావాస్య ఎప్పుడొచ్చింది, ఆ రోజున ఎలాంటి పవిత్ర కార్యాలు చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చొల్లంగి అమావాస్య ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 28 వ తేదీ మంగళవారం రాత్రి 7:30 నుంచి పుష్య బహుళ అమావాస్య తిథి మొదలై మరుసటి రోజు అంటే జనవరి 29 వ తేదీ సాయంత్రం 6:51 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయంతో అమావాస్య స్నానాలు చేయాలి కాబట్టి జనవరి 29 వ తేదీనే చొల్లంగి అమావాస్య జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుఝాము 3:30 గంటల నుంచి పుణ్యస్నానాలు చేయడానికి శుభసమయం.
చొల్లంగి అమావాస్య రోజు ఏమి చేయాలి
ఈ రోజు తెల్లవారుఝామున నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయాలి. విశేషించి ఈ రోజు చొల్లంగి సాగర సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. నదీ స్నానం చేయడానికి వీలు కానీ వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో పుణ్యనదులను ఆవాహన చేసుకొని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.
పితృదేవతల ప్రీతి కోసం ఇలా చెయ్యాలి
చొల్లంగి అమావాస్య రోజు పితృ దేవతల ప్రీతి కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణం చేయాలి. ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్ర వచనం.
దానధర్మాలు
చొల్లంగి అమావాస్య రోజు నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిన తరువాత నది ఒడ్డునే చేసే దానధర్మాలకు మామూలు కంటే కోటిరెట్ల అధిక ఫలం లభిస్తుంది. ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, గోదానం, ఛత్రదానం, జలపాత్ర, పాదరక్షలు మొదలైనవి దానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే ఈ రోజు కొత్త రాగి పాత్రలో నిండుగా నువ్వులు పోసి పాత్రతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.