తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

పాపాలు పోగొట్టి మోక్షం ప్రసాదించే నదీస్నానం! రాత్రిపూట చేస్తే జరిగేది ఇదే! - Can We Take River Bath At Night - CAN WE TAKE RIVER BATH AT NIGHT

Can We Take River Bath At Night : హిందూ ధర్మశాస్త్రం నదీ స్నానానికి పెద్దపీట వేస్తుంది. ప్రాచీనకాలంలో మహర్షులు, మునులు నదుల్లోనే స్నానం చేసేవారు. నదీ స్నానం వలన శరీరం, మనస్సు పవిత్రం అవుతాయని శాస్త్రం చెబుతోంది. అయితే నదీ స్నానం చేసే విషయంలో శాస్త్రం ఎలాంటి నియమాలు పాటించాలని చెబుతోందో ఇప్పుడు చూద్దాం.

Can We Take River Bath At Night
Can We Take River Bath At Night (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 3:33 AM IST

Can We Take River Bath At Night :హిందూ సంప్రదాయం ప్రకారం గంగ, యమునా, సరస్వతి, గోదావరి, కృష్ణా ఇలా నదులను నదీమతల్లులుగా భావించి పూజించడం ఆనవాయితీ. ఆయా నదుల్లో పవిత్ర స్నానం చేయడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు, పాపాలు పోతాయని నమ్మకం. అయితే నదీ స్నాన ఫలం సంపూర్ణంగా దక్కాలంటే ధర్మశాస్త్రం నిర్దేశించిన నియమాలు పాటించి తీరాల్సిందే! ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మారిన జీవన శైలి
ఆధునిక జీవితంలో నేటి యువత ఏ పని కూడా సమయానికి చేయడం లేదు. పొద్దున్నే నిద్ర లేవడం అన్నది అసలు లేనే లేదు. ఇక స్నానం అంటే రోజులో ఎప్పుడో ఒకప్పుడు చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసా! స్నానం చేయకుండా వంట చేయకూడదు. భోజనం తినకూడదు. ఇంట్లోనే ఇన్ని నియమాలు ఉంటే ఇక పుణ్య నదుల్లో స్నానం చేసేటప్పుడు ఎంతో పవిత్రంగా ఉండాలి కదా!

సూర్యోదయంతోనే నదీస్నానం ఉత్తమం
హిందూ సంప్రదాయం ప్రకారం ఒక నిర్దిష్టమైన సమయంలోనే నదీ స్నానం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తం మొదలుకొని, మధ్యాహ్నం 12 గంటల లోపు చేసే నదీస్నానమే పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక ఆ తర్వాత చేసే స్నానం నిష్ఫలమే అని శాస్త్రం చెబుతోంది.

రాత్రుల్లో నదీస్నానం నిషిద్ధం
రాత్రి సమయాల్లో నదీ స్నానం చేయరాదని అంటారు. అందుకు కారణమేమిటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే యక్షులు, గంధర్వులు సూక్ష్మ రూపంలో రాత్రి సమయాల్లో నదీ స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారంట! అందుకే ఆ సమయాల్లో నదీ స్నానం చేసి వారి ధ్యానానికి భంగం కలిగిస్తే పుణ్యం సంగతి అటుంచి పాపం మూట కట్టుకున్నట్లు అవుతుంది. బహుశా ఈ కారణం చేతనే ఏమో పవిత్ర నదులకు సంధ్యా సమయాల్లో హారతులు ఇస్తుంటారు.

పుణ్య తిథుల్లో పవిత్ర స్నానాలు
మకర సంక్రాంతి, మహా శివరాత్రి, మాఘ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, కుంభ మేళా, పుష్కరాలు వంటి పవిత్ర తిథుల్లో గంగా, గోదావరి, కృష్ణ, నర్మదా, సింధు, కావేరి వంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం వలన ఆత్మ శుద్ధి అవుతుంది. మోక్షం లభిస్తుంది.

పాపాలను పోగొట్టుకోవడానికి, సుఖ వంతమైన జీవితాన్ని గడపడానికి నదీ స్నానానికి మించిన సులభ మార్గం మరొకటి లేదు. ఇంతటి పవిత్రమైన నదీ స్నానాన్ని అంతే పవిత్రంగా భావించి ఆచరిస్తేనే పూర్ణ ఫలం దక్కుతుంది. అంతే కానీ ఏదో విహార యాత్రలకు వెళ్లి స్విమ్మింగ్ పూల్​లో చేరినట్లుగా స్నానాలు చేస్తే పవిత్రమైన నదుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు అవుతుంది. నదీ స్నానం చేసే వారు ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే మంచిది. శుభం భూయాత్!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details