Burugu Gadda Venugopala Swamy Temple :ఆలయాలలో ధనుర్మాసం సందడి మొదలైంది. ధనుర్మాసంలో ఆలయాలలో తెల్లవారుజామున జరిగే తిరుప్పావై ఎంతో వేడుకగా ఉంటుంది. ఈ మాసంలో గోదాదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. దక్షిణాదిన మాత్రమే గోదాదేవి ఆలయాలను చూడవచ్చు. అయితే ఒక ఆలయంలో గోదాదేవి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం.
గోదాదేవి చాలా ప్రత్యేకం
సాధారణంగా వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారు కొలువై కనిపిస్తారు. వేణుగోపాలస్వామి వారితో కలిసి గర్భాలయంలో గానీ, ఉపాలయాల్లోగాని అమ్మవారు దర్శనమిస్తారు ఉంటారు. అమ్మవారు ప్రత్యేక ఆలయంలో ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకున్న తరువాత భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే వేణుగోపాల స్వామిని దర్శించుకునే ఆనవాయితీ ఒక క్షేత్రంలో కనిపిస్తుంది.
ఒకే వేదికపై మూడు మూర్తులు
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో వెలసిన బూరుగు గడ్డ వేణుగోపాల స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది. గర్భాలయంలో ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి దర్శనమిస్తుంటారు. ఒకే వేదికపై ఈ మూడు మూర్తులు ఉన్నప్పటికీ, వేణుగోపాలస్వామి ప్రధాన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గర్భాలయంలో వేణు గోపాలుడు కుదురైన ఆకారంలో కనిపిస్తాడు.
అరుదైన గోదాదేవి విగ్రహం
ఈ ఆలయ ప్రాంగణంలోనే మరో ప్రత్యేక మందిరంలో గోదాదేవి అమ్మవారు కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
సుందరమైన విగ్రహం
ఇక్కడి గోదాదేవి అమ్మవారి విగ్రహం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. దాదాపు ఆరు అడుగుల ఎత్తును కలిగి ఉండే గోదాదేవి అమ్మవారి మూర్తి చూడగానే ఆధ్యాత్మిక భావంతో మనసు పులకరిస్తుంది. అమ్మవారి కనుముక్కు తీరు చూడ ముచ్చటగా కోల కళ్లు, అందమైన ముక్కుతో ఎంతో రమ్యంగా ఉంటుంది. సాధారణంగా గోదాదేవి కొప్పు విలక్షణంగా ఉంటుంది. ఈ కొప్పుతోనే అమ్మవారిని గోదాదేవిగా గుర్తించవచ్చు. ఇక్కడి గోదాదేవి విగ్రహానికి ఉన్న కొప్పు కూడా సౌందర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా అమ్మవారి మూర్తి ఇంత ఎత్తుగా ఉండటం చాలా అరుదు.
స్వయంభువు
ఈ గోదాదేవి స్వయంభువుగా వెలిసిందని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ మూర్తి తవ్వకాల్లో బయటపడింది.
బూరుగు గడ్డ పేరు ఇందుకే
పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వల్ల, ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు.
ఆలయ సంప్రదాయం
గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకున్న తరువాతనే ప్రధాన ఆలయంలోని మూర్తులను దర్శించుకోవాలనే ఒక నియమం ఇక్కడ కనిపిస్తుంది.