Bhishma Ashtami 2025 :తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు భీష్మాష్టమి. ఈ కథనంలో భీష్మాష్టమి ఎప్పుడు? భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.
భీష్మ ప్రతిజ్ఞ
శంతన మహారాజు, గంగాదేవి పుత్రుడే భీష్ముడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు. తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘ మాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు.
పంచప్రాణాలు అంటే ఇవే!
భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై ఉండి మాఘ శుక్ల సప్తమి నుంచి మొదలు పెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెపుతారు. భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది.
భీష్మాష్టమి విశిష్టత
వ్యాసమహర్షి రచించిన పద్మ పురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది. దాని ప్రకారం, మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది.
భీష్మాష్టమి ఎప్పుడు?
ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం తెల్లవారు ఝాము 5:32 నిమిషాల నుంచి మరుసటి రోజు ఫిబ్రవరి 6వ తేదీ గురువారం తెల్లవారుఝాము 3:13 నిమిషాల వరకు మాఘ శుద్ధ అష్టమి తిథి ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజునే భీష్మాష్టమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ ముహూర్తం. తర్పణాలు విడవాల్సిన సమయం మధ్యాహ్నం 12 గంటలు.