Bhadrapada Masam Festival : తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో ఆరవ మాసం భాద్రపద మాసం. భాద్రపదం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వినాయక చవితి పర్వదినం. కానీ ఇదే నెలలో వరాహ జయంతి, వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్ది, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్ష దినాలు ఇలా భాద్రపద మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాద్రపద మాసంలో వచ్చే పర్వ దినాలు, ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం.
పర్వదినాలు - విశేషాలు
సెప్టెంబర్ 3 : భాద్రపద మాసం ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 6 భాద్రపద శుక్ల తదియ : ఈ రోజు వరాహ జయంతి పర్వదినం. ఈ రోజు విష్ణువు వరాహ రూపం ధరించాడు. అందుకే వరాహస్వామిని తలచుకుని తెల్లని పువ్వులతో పూజించినా, భూదానము చేసినా, వెండి దానము చేసినా సకల శుభాలు కలుగుతాయి.
సెప్టెంబర్ 7 భాద్రపద శుద్ధ చవితి : ఈ రోజు వినాయక చవితి పర్వదినం. ఈ రోజు గణపతి పుట్టిన రోజు ఇంకా గణనాధుడు గణములన్నింటికీ అధిపతి అయిన రోజు కూడా. అందుకే విఘ్నేశ్వరుని పూజించి, ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టి, వాటిని మనము కూడా ప్రసాదంగా తిని, కథ విని అక్షింతలను శిరస్సున వేసుకోవాలి.
సెప్టెంబర్ 8 భాద్రపద శుద్ధ పంచమి: ఈ రోజు ఋషి పంచమి పర్వదినం. సాధారణంగా మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు ఋషి రుణం, దేవతా రుణము, పితృదేవతల రుణము ఈ మూడింటిని తప్పనిసరిగా తీర్చుకోవాలి. అందులో భాగంగా ఈ రోజు వీలున్నంత వరకు ఋషులను తలచుకోవాలి. ముందుగా గణపతి ప్రార్థన చేసి తరువాత సప్తర్షులను, అత్రి, మరీచి, కౌండిన్యుడు మొదలైన ఋషులను తలచుకోవాలి. ముఖ్యంగా పురాణం పురుషుడు వ్యాస భగవానుని తలుచుకోవాలి. ఋషుల రూపంలో ఉండే గురువులను, పౌరాణికులను ఈరోజు పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి ఋషి ఋణం తీరుతుంది. ఈ రోజు సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసి శివ దర్శనం చేసుకోవడం చాలా మంచిది.
సెప్టెంబర్ 11 భాద్రపద శుద్ధ అష్టమి: ఈ రోజు జ్యేష్ఠ గౌరీ పూజ. రాముని భర్తగా పొందేందుకు సీతాదేవి జ్యేష్ఠ గౌరీమాతను పూజించిందని అంటారు. వివాహం కావలసిన కన్యలు ఈ పూజ చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుందని శాస్త్ర వచనం.
సెప్టెంబర్ 14 భాద్రపద శుద్ధ ఏకాదశి : ఈ రోజు పరివర్తన ఏకాదశి. ఈ రోజు విష్ణు మూర్తిని లక్ష్మీదేవి సమేతంగా పూజిస్తే తెలిసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని అంటారు.
సెప్టెంబర్ 14 భాద్రపద శుద్ధ ద్వాదశి: ఈ రోజు వామన జయంతి పర్వదినం. మధ్యాహ్నం 11:45 నుంచి 12:30 లోపు ద్వాదశి ఘడియలు ఉన్న రోజున వామన జయంతి జరుపుకోవాలి. ఈ రోజు విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, విష్ణువును చామంతి పువ్వులు, మల్లె పువ్వులు లేదా పసుపు పచ్చని పూలతో పూజించడం చాలా మంచిది. ఈ రోజు బ్రాహ్మణులకు అన్నదానం, భూదానం, గోదానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.
సెప్టెంబర్ 16 భాద్రపద శుద్ధ చతుర్దశి: కన్య సంక్రమణం. ఈ రోజు సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నదీస్నానం, సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.
సెప్టెంబర్ 17 భాద్రపద శుద్ధ పౌర్ణమి: ఈ రోజు అనంత పద్మనాభ వ్రతం. భరించలేని కష్టాల నుంచి ఉపశమనం పొందాలంటే అనంత పద్మనాభ వ్రతాన్ని చేసుకోవాలని పెద్దలు అంటారు. ఈ రోజు శ్రీ అనంత పద్మనాభ స్వామిని పూజించి, వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి.