Batuk Bhairav Jayanti 2024: జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున బతుక్ భైరవ జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 16వ తేదీన జరుపుకోనున్న బతుక్ భైరవ జయంతిని ఎక్కువగా ఉత్తరభారతంలో జరుపుకుంటారు. వసుధైక కుటుంబమైన మన దేశంలో అన్ని ప్రాంతాల వారు అన్ని చోట్ల స్థిరపడి ఉన్నారు. వారందరి కోసమే ఈ ప్రత్యేక కథనం.
ఏ దేవుని పూజించాలి
బతుక్ భైరవ జయంతి రోజు పరమశివుని ఉగ్ర రూపమైన భైరవుని పూజించాలి. ఈ రోజు పరమశివుడు భైరవుడిగా అవతరించాడు. అందుకే ఈ రోజు భైరవ పూజను చేయాలి. శివ పురాణం ప్రకారం భైరవుడు శంకరుడు వేరు వేరు కాదు అనీ, శివుని సంపూర్ణ స్వరూపమే భైరవుడు అని తెలుస్తోంది. బతుక్ భైరవుని పూజిస్తే శత్రువుల కుట్రల తిప్పికొట్టే సమర్ధతో పాటు శత్రుజయం కలుగుతుందని శాస్త్ర వచనం.
బతుక్ భైరవ జయంతి వెనుక ఉన్న పురాణగాథ
పూర్వంలో ఆపద్ అనే రాక్షసుడు చాలా కఠోరమైన తపస్సు చేసి అమరుడయ్యాడు. దేవతలు, మానవుల ద్వారా చావు లేకుండా వరం పొందాడు. కేవలం ఐదు సంవత్సరాల బాలుని చేతిలో మాత్రమే అతనికి చావు కలిగేలా వరం ఉంది. ఆ గర్వంతో దేవతలను, మానవులను వేధించడం ప్రారంభించాడు. రోజు రోజుకు ఆ రాక్షసుని ఆగడాలు మితిమీరిపోతుంటే దేవతలంతా ఒకచోట సమావేశమై ఆపద్ నుంచి రక్షించే వాడు శివుడు ఒక్కడే అని పరమేశ్వరుని వద్దకు వెళ్లి ప్రార్ధిస్తారు.
పసి బాలునిలా పరమేశ్వరుడు
దయాళుడైన ఆ పరమేశ్వరుడు తన అంశతో ఐదేళ్ల బాలునిలా జన్మిస్తాడు. ఆ బాలునికి బతుక్ భైరవ అని పేరు పెడతారు. ఈ బాలుడు ఆపద్ రాక్షసుని సంహరించి దేవతలకు, మానవులకు ఉపశమనం కలిగిస్తాడు.
బతుక్ భైరవ జయంతి పూజ ఎలా చేయాలి?
బతుక్ భైరవ జయంతి రోజు భైరవుని వాహనమైన కుక్కను పూజించాలి. ఈ రోజు ఈ పరిహారాలు చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది.