Significance Of Bada Mangal : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం హనుమంతుని ఆరాధనకు విశిష్ట స్థానముంది. సాధారణంగా దక్షిణ భారతంలో అమావాస్య నుంచి అమావాస్య వరకు మాసాలను లెక్కిస్తారు. అదే ఉత్తర భారతంలో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మాసాలను లెక్కిస్తారు. ఈ క్రమంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాలను బడ మంగళ్ అంటారు. ఈ బడ మంగళ్ రోజు హనుమంతుని ఆరాధనకు పవిత్రమైనదిగా భావిస్తారు.
సత్వర ఉపశమనం
మామూలు మంగళవారాల్లో హనుమంతుని ఆరాధిస్తే వచ్చే ఫలితానికి కోటిరెట్లు బడ మంగళ్ రోజు హనుమను ఆరాధిస్తే ఉంటుందని శాస్త్రవచనం. అందుకే జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున హనుమంతుని ఆరాధిస్తే పనుల్లో తరచుగా వచ్చే ఆటంకాలు, ఆర్థిక బాధల నుంచి సత్వర ఉపశమనం ఉంటుందని అంటారు.
బడ మంగళ్ పూజ ఇలా చేయాలి?
జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారం రోజు ఉదయాన్నే స్నానం చేసి ఎరుపు రంగు ఆసనంపై కూర్చొని 7 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలా చేయడం వలన హనుమంతుని అనుగ్రహాన్ని శ్రీఘ్రంగా పొందవచ్చు.
- బడ మంగళ్ రోజు హనుమకు ఎర్రని వస్త్రాన్ని, ఎరుపు రంగు పండ్లను సమర్పించి ఆ పండ్లను ప్రసాదంగా అందరికీ పంచి పెట్టాలి. ఇలా చేయడం వలన హనుమంతుని అనుగ్రహంతో సకల మనోభీష్టాలు నెరవేరుతాయి.
- బడ మంగళ్ రోజు హనుమంతుని ఆరాధనలో తమలపాకులను విశేషంగా సమర్పిస్తే కుటుంబంలో సుఖశాంతులు దొరుకుతాయి. వాయిదా పడ్డ పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తవుతాయి.
- ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్ధిక వృద్ధి కోరుకునేవారు బడ మంగళ్ రోజు ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామి విగ్రహం వద్ద ఉండే సింధూరాన్ని తీసుకొని సీతాదేవి పాదాలకు సమర్పిస్తే ఆర్థిక పురోగతికి వేగంగా ఉంటుంది.
బడ మంగళ్ పూజా నియమాలు
- బడ మంగళ్ పూజ చేసేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మద్య మాంసాలు ముట్టుకోరాదు.
- హనుమంతుని విగ్రహాన్ని మాత్రమే పూజించాలి. హనుమంతుని చిత్రపటాలకు చేసే పూజలకు వేగంగా ఫలితాలు ఉండవని అంటారు.
- బడ మంగళ్ రోజు 21 అరటిపండ్లు హనుమకు నివేదించి అనంతరం ఆ అరటి పండ్లను కోతులకు ఆహారంగా సమర్పిస్తే కార్యజయం, ఐశ్వర్యప్రాప్తి తప్పక ఉంటాయి. జై హనుమాన్!
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.