Ashta Ganesha Temples In India :హిందూ సంప్రదాయం ప్రకారం గణపతిని పూజించనిదే ఏ శుభకార్యం కూడా మొదలుపెట్టరు. దేవతల నుంచి మానవుల వరకు ఏ పని మొదలు పెట్టాలన్న ముందుగా గణపతిని ప్రార్ధించాల్సిందే! మన దేశంలో గణపతికి ప్రాచీనమైన ఆలయాలు ఎన్నో కలవు. కానీ వినాయకుడు కొలువైన అష్ట వినాయక క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అవన్నీ ఒకే రాష్ట్రంలో వెలసి ఉండటం మరి విశేషం. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
విఘ్నాలను తొలగించే గణపతి
తొలి పూజలందుకునే గణపతి శుభాలను, లాభాలను చేకూర్చుతాడని విశ్వాసం. విఘ్నాలను తొలగించి కార్యసిద్ధి, విజయాలను ప్రసాదించేది వినాయకుడే కనుక, వేదకాలం నుంచి ఆ స్వామిని పూజించడమనేది జరుగుతూ వస్తోంది.
దేశమంతటా ఆలయాలు
గణనాథునికి దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో అష్ట వినాయక క్షేత్రాలు మరింత ప్రసిద్ధి చెందినవి. విశేషమేమంటే ఈ ఆలయాలు అన్నీ కూడా మహారాష్ట్ర పరిసరాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని స్వయంభువులైన అష్ట వినాయక క్షేత్రాలు దర్శిస్తే సకల కష్టాలు తొలగి, సర్వ సుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అష్ట వినాయక క్షేత్రాలు దర్శించే విధానం
ఈ అష్ట వినాయక క్షేత్రాలను దర్శించడానికి ఓ పద్ధతి ఉంది. ఒక వృత్తం ఎక్కడ మొదలు పెడతామో గుండ్రంగా తిరిగి అక్కడకే వచ్చి పూర్తి చేస్తాం. అలాగే అష్ట వినాయక క్షేత్రాలు కూడా ఏ క్షేత్రంలో మొదలు పెట్టి ఏ క్షేత్రంలో పూర్తి చేయాలని దానికి ఓ క్రమ పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతి ప్రకారమే ఆ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం.
మయూర గణపతి క్షేత్రం
అష్ట వినాయక క్షేత్రాలలో ముందుగా మయూర గణపతి క్షేత్రాన్ని దర్శించాలి. మహారాష్ట్రలోని బారామతి తాలూకాలోని మోర్గావ్లో వినాయకుడు 'మయూరేశ్వరుడు'గా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రాన్ని మయూర గణపతి క్షేత్రం అని అంటారు.
నెమలి వాహనం
సాధారణంగా వినాయకుని వాహనం ఎలుక. అన్ని వినాయక క్షేత్రాలలోను వినాయకుడు ఎలుక వాహనంపై దర్శనమిస్తాడు. కానీ మయూర గణపతి క్షేత్రంలో మాత్రం వినాయకుని వాహనం నెమలి. ఇక్కడ వినాయకుడు మయూరాన్ని ఆసనంగా చేసుకొని ఉండడమే ఈ క్షేత్రం ప్రత్యేకత.
స్థల పురాణం
పూర్వం మోర్ గావ్ ప్రాంతంలో సింధురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతుండేవాడట. ఆ సమయంలో దేవతలు, మునులు ఆ రాక్షసుని పీడ తొలగించమని వినాయకుని ప్రార్ధించారు.