Records of Rights Act 2024 in Telangana : భూ సమస్య పరిష్కారానికి ఎలా సాయం పొందాలో.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియని రైతులకు ఉచిత న్యాయ సహాయాన్ని ప్రభుత్వం అందించేలా కొత్త ఆర్వోఆర్ చట్టం ఉపయోగపడుతుంది. ఇనాం భూములకు హక్కులు, ఎసైన్డ్ భూములకు పాసుపుస్తకాలు, పార్టీ-బీలో చేరిన భూముల సమస్యలను పరిష్కారించనుంది. రాష్ట్రంలో ప్రజావాణి కార్యక్రమాల్లో రైతుల నుంచి వచ్చిన సమస్యలపై ప్రభుత్వం పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్వోఆర్-2024 చట్టంలో భూ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపింది. ఈ సందర్భంగా ధరణి-2020, ఆర్వోఆర్-2024 (భూ భారతి) చట్టాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, సారూప్యతలు, కొత్తగా తెచ్చిన సెక్షన్లు, రద్దయినవాటిపై విశ్లేషణాత్మక కథనం.
- లాలయ్య అనే నిరుపేద రైతు దగ్గర ఎకరా ఇనాం భూమి ఉంది. ఎన్నోఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. సెప్టెంబరు 2017 వరకు ఆయనకు పట్టా పాసుపుస్తకం ఉంది. భూదస్త్రాల ప్రక్షాళన ఆ తర్వాత వచ్చిన ఆర్వోఆర్ చట్టంతో కొత్త పాసు పుస్తకం మాత్రం రాలేదు. కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేవు. వాటి కోసం ఇన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం లభించలేదు. తాజాగా భూ భారతి చట్టంలో జిల్లా స్థాయిలో ఆ రైతుకు పాసుపుస్తకం వచ్చే అవకాశం ఉంది.
- మడెప్ప అనే రైతు తన పేరు మీద అదనపు విస్తీర్ణం నమోదైందని, దాన్ని తొలగించాలని రాసిచ్చినందుకు 2019లో అధికారులు ఆయనకు చెందిన 4.30 ఎకరాలను కూడా ధరణి నుంచి తొలగించి వేరేవారి పేరుమీద చేర్చారు. తిరిగి ఆయన ఖాతాలో చేర్చడానికి పాత చట్టం ప్రకారం వెసులుబాటు లేకపోవడంతో ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే ఈ సమస్య పరిష్కారం కానుంది.
ఏ చట్టంలో ఎలాంటి అంశాలు ఉన్నాయో తెలుసుకుందాం :
1. సేవలు
ఆర్వోఆర్ - 2020(ధరణి): ధరణి చట్టం ద్వారా పోర్టల్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో వారసత్వ బదిలీ, రిజిస్ట్రేషన్-మ్యుటేషన్, బహుమతి, నాలా, బహుమతి, భాగ పంపిణీ సేవలు అందించింది. కానీ అభ్యంతరాలకు మాత్రం అవకాశం కల్పించలేదు,
ఆర్వోఆర్ - 2024(భూ భారతి) : 2020లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ పేరును భూ -భారతిగా మార్చారు. వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీల్లో ఏకకాల రిజిస్ట్రేషన్-మ్యుటేషన్ సేవలు కొనసాగనున్నాయి. మ్యుటేషన్‌పై అభ్యంతరాలను సైతం స్వీకరించేలా అప్పీళ్లకు అవకాశం కల్పించారు.
2. పట్టా భూముల సమస్యలు
ఆర్వోఆర్ - 2020(ధరణి) : ధరణి పోర్టల్లో సమాచారం ఉన్న భూములకు సంబంధించిన వాటికి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండగా పాసుపుస్తకాలు జారీ చేసేవారు. 2017-18లో దస్త్రాల ప్రక్షాళన చేపట్టగా భూముల సమాచారాన్ని మాత్రమే ధరణిలో పొందుపరిచారు. సమస్యల పరిష్కార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదు.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): పోర్టల్లో సమాచారం ఉన్న భూముల లావాదేవీలకు అనుమతి ఇస్తారు. సాగులో ఉన్నా హక్కుల రాని సుమారు 8 లక్షల ఎకరాలకు చెందిన రైతులకు హక్కలు కల్పిస్తారు. ఆర్వోఆర్-1971 కింద పాసుపుస్తకాలు ఉన్నవారికి కొత్తచట్టంలోని హక్కులు కల్పిస్తారు. ఖాతాల్లో తేడాలు, సర్వే నంబర్లలో తప్పులు, రికార్డులో భిన్నంగా సాగు వేరేచోట ఉండటం తదితర సమస్యలు ఉన్నప్పటికీ అసలు సాగుదారుల పేరు మీద హక్కులు కల్పిస్తారు.
3. పార్ట్-బీ వివాదాలు
ఆర్వోఆర్ - 2020(ధరణి): భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో హక్కుల్లో వివాదాలు ఉంటే ఆ భూములను పార్ట్-బి కింద పక్కనే పెట్టేసేవారు. అయితే దీనిపై విచారణ చేసి పరిష్కారం కల్పించాలని నిర్దేశించినప్పటికీ చట్టంలోని ఆ మేరకు అధికారాలు కల్పించలేదు. దీంతో ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): సుమారు 18 లక్షల ఎకరాలుు పార్ట్-బీ కింద ఉన్నట్లు అంచనా వేశారు. హద్దుల సమస్యలు, సర్వే లోపాలు, చిన్నచిన్న వివాదాలు, మ్యుటేషన్‌పై ఫిర్యాదులు వంటిపై అధికారులు విచారణ చేపట్టారు. దీని కోసం మూడు రకాల పరిష్కార మార్గాలను కల్పించారు. సులభతరంగా ఉన్న సమస్యలను తహసీల్దారు స్థాయిలో, మధ్యస్తంగా ఉన్న సమస్యలను ఆర్డీవో స్థాయిలో, తీవ్రస్థాయిలో ఉన్న సమస్యలను కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేలా సెక్షన్లు ఏర్పాటు చేశారు. సుమారు 23 రకాల భూ యాజమాన్యాలకు సంబంధించి పరిష్కారాలు చూపుతారు. ఈ నేపథ్యంలో ఏమైనా అభ్యంతరాలు తలెత్తితే అప్పీలుకు అవకాశం ఉంది.
4. వారసత్వ బదిలీ
ఆర్వోఆర్ - 2020(ధరణి): వారసత్వ బదిలీ ప్రక్రియలో కుటుంబసభ్యుల ఉమ్మడి అంగీకార పత్రం, సభ్యుల హాజరు తప్పనిసరిగా చేసినా అధికారులకు నోటీసులు జారీ చేసే అధికారం మాత్రం కల్పించలేదు. ఈ నేపథ్యంలో స్లాట్లు బుక్ చేసుకుంటే చాలు వారసత్వ బదిలీ పూర్తయ్యేది. ఈ క్రమంలో ఇతర కుటుంబసభ్యల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చేవి.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): పాత చట్టంలాగా కాకుండా కొత్త చట్టంలో వారసత్వ బదిలీపై కుటుంబసభ్యులకు తహసీల్దారు నోటీస్ జారీ చేస్తారు. విచారణ జరిపి మ్యుటేషన్ ఉత్తర్వు జారీ చేస్తారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలుకు కూడా అవకాశం ఉంటుంది.
5. ఎసైన్డ్ భూములకు పట్టాలు
ఆర్వోఆర్ - 2020(ధరణి): పూర్తిస్థాయిలో విచారణ లేకపోవడంతో ఎసైన్డ్, లావుణీ భూములకు స్పష్టత ఉన్నదని భావించిన చోట మాత్రమే పాసుపుస్తకాలు జారీ చేశారు.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): ఎసైన్డ్, లావుణీ తదితర భూములు దాదాపు 24 లక్షల ఎకరాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అంచనా. గతంలో వీటికి పాసుపుస్తకాలు జారీ చేయలేదని గుర్తించారు. తాజాగా రైతులు దరఖాస్తు చేసుకోకున్నా పట్టా పాసుపుస్తకాలు అయితే జారీ చేస్తారు. అవసరమైతే విచారణ జరుపుతారు.
6. అప్పీళ్ల వ్యవస్థ
ఆర్వోఆర్ - 2020(ధరణి): ధరణి పోర్టల్లో ఉన్న రైతుల సమాచారమే మాత్రమే ఫైనల్. మ్యుటేషన్ సంబంధిత హక్కుల విషయంలో అభ్యంతరాలుంటే కోర్టులను ఆశ్రయించడం తప్ప మరో పరిష్కారం లేదు. పట్టా భూమి ప్రభుత్వ భూమిగా నమోదైందని, భూ విస్తీర్ణాలలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయని పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): 18 రకాల భూములకు సంబంధించి యజమాని హక్కుల మార్పిడిలో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అయితే కోర్టులకు వెళ్లకుండా నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న 18 రకాల భూముల్లో ఆరు తహసీల్దారు. మిగితా భూములకు ఆర్డీవో మ్యుటేషన్ పూర్తి చేస్తారు. అంతేకాకుండా అభ్యంతరాలపై అప్పీళ్లకు కూడా అవకాశం కల్పించారు. తహసీల్దారుపై ఆర్డీవో..ఆర్డీవోపై కలెక్టర్, కలెక్టర్‌పై ల్యాండ్ ట్రైబ్యునల్ వరకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
7. మ్యుటేషన్లపై అప్పీలు
ఆర్వోఆర్ - 2020(ధరణి) : దస్త్రాల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాల వల్ల పలు జిల్లాల్లో ఎన్నో ఏళ్ల కింద భూముల యజమానులుగా ఉన్నవారి పేర్లు ప్రస్తుత యజమానులుగా రెవెన్యూ దస్త్రాల్లో తిరిగి నమోదయ్యాయి. ధరణిలోని సమాచారమే ఫైనల్ కావడంతో దీనిపై న్యాయవివాదాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): ఇలాంటి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలను భూభారతి చట్టం ద్వారా అడ్డుకోవచ్చు. ఒకరి చేతుల్లో భూములు ఉండగా రికార్డులో పాత యజమానుల పేర్లు ఉంటే అడ్డుకోవచ్చు. మ్యుటేషన్‌ను రద్దు చేసే అధికారం ఆర్డీవోకు ఉంటుంది. అభ్యంతరాలుంటే కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా జరిగిన మ్యుటేషన్లలో తప్పులున్నా ఆర్డీవోకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
8. కొత్త పాసుపుస్తకాల జారీ అధికారం
ఆర్వోఆర్ - 2020(ధరణి): ధరణి లావాదేవీల్లో మినహా కొత్తగా పాసుపుస్తకాల జారీ చేసే అధికారుల ఏ స్థాయిలోనూ కల్పించలేదు. అయితే ఇతర చట్టాల ద్వారా హక్కుల జారీకి నిబంధనలు లేవు. చట్టంలో ఎలాంటి నిబంధనలు లేక పోర్టల్లో సుమారు 2.45 లక్షల దరఖాస్తులు పేరుకుపోయాయి.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): 38-ఈ రక్షిత కౌలుదారులకు ఇచ్చే ధ్రువీకరణ పత్రం, ఇనాం భూములకు అధీకృత ధ్రువీకరణ పత్రం(ఓఆర్సీ), కోర్టుల తీర్పుల ద్వారా దఖలు పడే హక్కులు, ఎసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వారికి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుతో ఇచ్చే పాసుపుస్తకాల జారీ అధికారాన్ని కొత్త చట్టం కల్పిస్తుంది. వేర్వురు చట్టాల ద్వారా హక్కులు దఖలు పడిన సమయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆర్డీవో పాసుపుస్తకాలను జారీ చేస్తారు. ధరణిలో ఉన్న పెండింగ్ దరఖాస్తుల పరిష్కార బాధ్యతలను తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌లకు అప్పగించారు.
9. అధికారులపై చర్యలు
ఆర్వోఆర్ - 2020(ధరణి): రికార్డులు దిద్దినట్లు తేలినా తప్పులు చేసినా తహసీల్దారుపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. పాసుపుస్తకాల రద్దు అధికారం జిల్లా కలెక్టర్‌కు మాత్రమే అప్పగించారు. అప్పీలుకు కూడా అవకాశం లేదు.
ఆర్వోఆర్ - 2024(భూ భారతి): క్రిమినల్, శాఖాపరమైన చర్యలు పాత చట్టంలాగానే యథాతథంగా కొనసాగుతాయి. ఈ చట్టం ద్వారా పాసుపుస్తకాల రద్దు అధికారం జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అప్పీలుకు కూడా అవకాశం కల్పించారు.
ఎట్టకేలకు సాదాబైనామాలకు మోక్షం! - ఆ భూముల కొనుగోళ్లను క్రమబద్ధీకరించనున్న ప్రభుత్వం