తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ గుడిలోని తీర్థాన్ని తాగితే అనారోగ్యం దరిచేరదట! ఈ స్పెషల్​ ఆలయం ఎక్కడ ఉందంటే? - Aragonda Anjaneya Swamy Temple - ARAGONDA ANJANEYA SWAMY TEMPLE

Aragonda Anjaneya Swamy Temple : సాధారణంగా హనుమను ఆరాధిస్తే భయాలు పోయి, కార్యసిద్ధి, జయం కలుగుతాయని విశ్వాసం. కానీ ఈ ఆంజనేయుని ప్రార్థిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయని విశ్వాసం. సంజీవరాయ క్షేత్రంగా పేరొందిన ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.

Aragonda Anjaneya Swamy Temple
Aragonda Anjaneya Swamy Temple (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 6:29 AM IST

Aragonda Anjaneya Swamy Temple :పచ్చని కొండల మధ్య ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న ఈ హనుమ క్షేత్రాన్ని సందర్శిస్తే అనారోగ్యం దరిచేరదట. ఈ ఆలయంలోని హనుమను పూజిస్తే అనేక రకాల అనారోగ్యాలు నశించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన అరగొండ వీరాంజనేయస్వామి ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం.

ఈ ఆలయం ఎక్కడ ఉంది
పవిత్ర తిరుపతి పుణ్య క్షేత్రానికి 75 కిలోమీటర్ల దూరంలో అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం అని కూడా అంటారు.

స్థల పురాణం
త్రేతా యుగంలో రామ-రావణుల యుద్ధం సమయంలో రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తుని శరాఘాతానికి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు. ఆ సమయంలో శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సంజీవని మూలికలు తేవడానికి వాయువేగంతో హిమాలయాలకు వెళ్తాడు. సంజీవని పర్వతానికి చేరుకున్న హనుమ మూలికలు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో ఓ ప్రదేశంలో సంజీవని పర్వతం నుంచి అర్ధ భాగం విరిగి పడిపోతుంది. ఆ ప్రదేశమే ఇప్పటి అరగొండ. అర కొండ పడింది కాబట్టి అర కొండ అని పేరొంది కాలక్రమేణా అరగొండగా మారిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

అత్యంత మహిమాన్వితం సంజీవరాయ తీర్థం
సంజీవని పర్వతం విరిగి పడిన ప్రాంతంలో భూమి నుంచి జలధారలు ఉబికి వచ్చి ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పడింది. అదే సంజీవరాయ తీర్ధంగా ప్రసిద్ధి చెందింది. సంజీవరాయ తీర్ధంలో సంజీవకరణి, విషల్యకరణి అనే మహిమాన్విత వనమూలికలు, ఔషధాలు కలిసి ఉండడం వలన ఆ తీర్ధంలో నీటికి అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని విశ్వాసం. అంతేకాదు ఇక్కడ మట్టిని శరీరానికి రాసుకుంటే భయంకరమైన చర్మవ్యాధులు నశిస్తాయని విశ్వాసం. త్రేతాయుగం నాటి ఈ సంజీవరాయ తీర్థంలో స్నానం చేయడానికి, తీర్ధ జలాలను సేవించడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్త జనం తరలి వస్తారు.

విజయాలనందించే హనుమాన్
సంజీవరాయ తీర్థం త్రేతా యుగానికి చెందినప్పటికీ, ఇక్కడ హనుమాన్ ఆలయం మాత్రం చోళ రాజులు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడి హనుమ విజయాలనందించే స్వామిగా కొలువు కావడం వెనుక కూడా ఓ కథ ఉంది.

కశ్యప ప్రతిష్ట హనుమ
ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. అందుకే ఇక్కడి హనుమను కొలవడం వలన సకల ఐశ్వర్యాలు, విజయాలు చేకూరాలన్న ఉద్దేశంతో సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి, హనుమంతుని విగ్రహాన్ని సంజీవరాయ తీర్థం పక్కన ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

కొత్త పని ప్రారంభించే ముందు స్వామి దర్శనం
ఎవరైనా కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతుందని విశ్వాసం. అందుకు నిదర్శనాలు కూడా ఎన్నో ఉన్నాయి.

పౌర్ణమి ఎంతో కీలకం
పౌర్ణమి రోజు సంజీవరాయ తీర్ధంలో చంద్ర కిరణాలు ప్రసరించి ఆ నీటికి ఉన్న మహత్యం వేయి రెట్లు పెరుగుతుందని నమ్మకం. ఆ రోజున తీర్ధాన్ని సేవిస్తే ఎలాంటి అనారోగ్య బాధలైనా దూరమవుతాయంట! అందుకే పౌర్ణమి రోజు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. అంతేకాదు ఓ నియమం ప్రకారం తొమ్మిది పున్నములు ఈ క్షేత్రానికి వచ్చి తీర్థ జలాలను సేవిస్తారు భక్తులు.

విశేష పూజలు
ప్రతి పౌర్ణమికి ఉదయాన స్వామికి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరుగుతుంది. సాయంత్రం ప్రాకారోత్సవం, ఆకుపూజ, వడమాల సేవలతో పాటు విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో శివుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి.

ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకుందాం. త్రేతాయుగం నాటి సంజీవరాయ తీర్ధ జలాలను సేవిద్దాం. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం.

జై హనుమాన్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

చెరువు మధ్యలో మట్టితట్టలు మోసిన శివయ్య- ఎదురుగా రెండు నందులు- మహిమాన్విత ఆలయం ఎక్కడుందంటే? - Famous Siva Temple

ద్వాదశ ఆదిత్యులు ఎవరో తెలుసా? ఆరాధిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవ్! - Dwadash Aditya Worship

ABOUT THE AUTHOR

...view details