Aja Ekadashi Puja Vidhi : విష్ణు పురాణం, భవిష్య పురాణం ప్రకారం శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించాలి. అజా ఏకాదశి రోజు భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో లక్ష్మీ నారాయణులను పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం నుంచి విముక్తి పొంది సుఖసంతోషాలను పొందుతారని విశ్వాసం.
అజా ఏకాదశి ఎప్పుడు
శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశిగా జరుపుకుంటాం. ఆగస్టు 28 వ తేదీ బుధవారం రాత్రి 1:20 నిముషాల నుంచి ఆగస్టు 29 వ తేదీ గురువారం రాత్రి 1:38 నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఆగస్టు 29 వ తేదీ గురువారం రోజునే అజా ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
అజా ఏకాదశి పూజకు శుభసమయం
ఆగస్టు 29 వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోపు అజా ఏకాదశి పూజకు శుభ సమయంగా పంచాంగ కర్తలు చెబుతున్నారు.
అజా ఏకాదశి పూజా విధానం
ఏకాదశి వ్రతానికి ఉపవాసం, జాగరణ ఎంతో ముఖ్యం. అజా ఏకాదశి వ్రతం ఆచరించే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు వీలైతే నదీ స్నానం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది. వీలుకాని పక్షంలో స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని తలారా స్నానం చేయాలి. పూజామందిరంలో లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ, చిత్ర పటాన్ని కానీ గంధం కుంకుమలతో అలంకరించుకొని సిద్ధం చేసుకోవాలి. ఆవునెయ్యితో దీపారాధన చేసుకొని ఈ రోజు పూర్తిగా ఉపవాసం చేస్తానని దేవుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి.
పసుపు రంగు శ్రేష్టం
పసుపు రంగు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజు లక్ష్మీ నారాయణులను పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఏకాదశి రోజు చేసే విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. అనంతరం పసుపు రంగు ప్రసాదాలు అనగా శెనగలతో చేసిన గుగ్గిళ్ళు, నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డు వంటి ప్రసాదాలను నివేదించాలి. ఏకాదశి వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. దేవునికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి.