Ainavilli Vinayaka Temple History :తెలుగు రాష్ట్రాల్లో గణనాధుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. వాస్తవానికి కాణిపాకం కన్నా ముందే ఈ ఆలయం ఉందని విశ్వాసం. గణనాథుడు స్వయంభువుగా వెలసిన ఈ గణపతి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. వినాయక చవితి పర్వదినం, గణేశ నవరాత్రుల సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అయినవిల్లిలో స్వయంభువుగా వెలసిన వినాయకుని నారికేళ వినాయకుడు అని కూడా అంటారు. మనసులో కోరికను తలచుకొని భక్తితో ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోర్కెలు తీర్చే నారికేళ గణనాథుడు భక్తులచే నిత్యం పూజలందుకుంటున్నాడు.
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది?"
పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాల నడుమ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ దూరంలో, అమలాపురానికి 12 కి.మీ దూరంలో వెలసిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏకదంతుడు సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు.
ఆలయ స్థల పురాణం
ఇతిహాసం ప్రకారం అయినవిల్లి ఆలయానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని అంటారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో మొదటిదిగా భాసిల్లే ఈ క్షేత్రం కృతయుగానికి చెందినదని విశ్వాసం.
వ్యాస ప్రతిష్ఠ వినాయకుడు
మరో కథనం ప్రకారం వ్యాస మహర్షి దక్షిణాది యాత్ర ప్రారంభానికి ముందు ఈ ప్రాంతంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారని, అనంతరం దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని చెపుతుంటారు. కాలక్రమేణా తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఈ ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారని తెలుస్తోంది.
ఆలయ చరిత్ర
అయినవిల్లి విఘ్నేశ్వర క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనదని స్థలపురాణం ద్వారా మనకు స్పష్టమవుతోంది. 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో వివరించిన ప్రకారం పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహా యజ్ఞం జరుగుతుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని, ఆ సమయంలో వినాయకుని హేళన చేసిని ముగ్గురిని స్వామి శపించాడని తర్వాతి కాలంలో వారే మూగ, చెవిటి, గుడ్డి వారిగా జన్మించి కాణిపాకం వినాయకుని ఆవిర్భావాన్ని కనుగొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కథనం ఆధారంగా అయినవిల్లి కాణిపాకం కంటే కూడా పురాతనమైన ఆలయమని స్పష్టమవుతోంది.
దక్షిణాభిముఖంగా గణపతి
సాధారణంగా దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటే అయినవిల్లిలో మాత్రం వినాయకుడు దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు. అందుకే అయినవిల్లిలో దక్షిణ ముఖ ద్వారంగా ఉండే గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, ఆ ఇంట్లో నివసించే వారు కూడా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉంటారని ప్రతీతి. అయినవిల్లిలో గణపతితో పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి, శివుడు. శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ కాలభైరవ స్వామి ఉపాయాలు కూడా దర్శించుకోవచ్చు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో ప్రతీ నెలా కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధి వినాయకునికి విశేషార్చనలు జరుగుతాయి. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమనం ప్రకారం కొబ్బరికాయలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. భక్తులు ఒకసారి ఇక్కడికి వచ్చి తమ కోరికను స్వామికి విన్నవించి, కోరికలు తీరిన వెంటనే వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు.
లక్ష పెన్నులతో విశేష పూజ
అయినవిల్లిలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో వినాయకునికి లక్ష పెన్నులతో విశేష పూజలు జరుగుతాయి. ముందుగా సప్తనదీ జలాలతో అభిషేకం చేసిన తరువాత లక్ష పెన్నులతో గణనాథునికి పూజ నిర్వహించి ఆ పెన్నులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంచి పెడతారు. విశేషమేమిటంటే ఈ పెన్నులు తీసుకోవడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు తరలి వస్తారు. ఒక్క కొబ్బరికాయ కొడితే అనుగ్రహించే అయినవిల్లి గణపతిని మనం కూడా దర్శించుకుందాం. తరిద్దాం. జై గణేష్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.