Mohini Avatharam : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగా కూడా స్వామి భక్తులను అలరిస్తూ దర్శనమిస్తారు. ముగ్ధమనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా మోహిని అవతార విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
జగన్నాటక సూత్రధారి దేవదేవుడు
పోతనామాత్యుడు రచించిన భాగవతం ప్రకారం, క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృతం కోసం దేవదానవులు కలహించుకున్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారంలో అమృత కలశాన్ని చేత పట్టి, రాక్షసులను మాయా మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచి పెట్టారని పురాణగాథ.