Heavy RainFall Alert in GHMC : గ్రేటర్ హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఇందిరా పార్క్ వద్ద కారుపై ఓ చెట్టు కూలగా ఉప్పల్ పారిశ్రామిక ప్రాంతంలోనూ మరో భారీ వృక్షం వేళ్లతో సహా నేలకూలింది. సికింద్రాబాద్ అడ్డగుట్ట వద్ద ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళ్తున్న కారు, ఆటోపై పడటంతో అందులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
అల్వాల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలింది. భారీ వృక్షం పడడంతో అక్కడే ఉన్న కారు ధ్వంసమైంది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో ఆ ప్రాంతాలలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తుకారం గేట్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వృక్షాన్ని తొలగిస్తున్నారు. అలాగే చాంద్రయాణగుట్ట పూల్ బాగ్ వద్ద కూడా ఓ చెట్టు పడిపోవడంతో హుటాహుటిన డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని చెట్టును తొలగించారు. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ వద్ద క్రేన్ ఢీ కొని గుర్తుతెలియని మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.
సురక్షిత ప్రాంతాలకు కార్మికులకు : నాంపల్లిలో గాంధీభవన్ ప్రహారి గోడ కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పార్కింగ్ చేసిన కార్లపై గోడ కూలడంతో కార్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా భవన నిర్మాణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బిల్డర్లను ఆదేశించారు. క్రెడాయ్, నారెడ్కో సంస్థలు భవన నిర్మాణ కార్మికుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాల వల్ల నిర్మాణ సైట్స్‌లో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.